అసెంబ్లీలో కోనసీమ రైతుల గోస
ఉభయ గోదావరి జిల్లాల్లోని రైతాంగాన్ని వేధిస్తున్న డ్రైనేజీ సమస్యలు, పంట నష్టాలపై రాష్ట్ర అసెంబ్లీ వేదికగా కీలక చర్చ జరిగింది. రాజోలు నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం వల్ల వేలాది ఎకరాల్లో పంటలు మునిగిపోతున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం, రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది.
మునిగిన పంటలు.. ఎండుతున్న కొబ్బరి తోటలు
రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ.. డ్రైనేజీ సమస్యల కారణంగా సుమారు 6000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వెల్లడించారు. సముద్ర మట్టం పెరగడం, భూమి కుంగిపోవడం వల్ల లక్ష ఎకరాల్లో కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని, ఈ సమస్యను ప్రకృతి విపత్తుగా గుర్తించి రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన విన్నవించారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: అచ్చెన్నాయుడు
ఎమ్మెల్యే ప్రశ్నకు సమాధానమిస్తూ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల కాలంలో డ్రైనేజీల నిర్వహణకు ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం వల్లే పరిస్థితి ఇంతలా విషమించిందని మండిపడ్డారు. సమస్య పరిష్కారానికి శాశ్వత ప్రాజెక్టును రూపొందిస్తున్నామని, సర్వే కోసం ఇప్పటికే రూ.17 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.
కొబ్బరి రైతులకు రూ.10 కోట్ల సాయం
కొబ్బరి తోటల నష్టంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మల్కీపురం, మామిడికుదురు మండలాల్లో దెబ్బతిన్న ప్రతి కొబ్బరి చెట్టుకు రూ.1,000 చొప్పున మొత్తం రూ.10 కోట్లు ఆర్థిక సాయం అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులకు రూ.20.77 కోట్లు మంజూరు చేశామని, త్వరలోనే పనులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
పథకాల ద్వారా రైతులకు భరోసా
రైతులను ఆదుకునేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా ఎకరాకు గరిష్టంగా రూ.99,181 వరకు ఆర్థిక సాయం అందించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వివరించారు. అలాగే కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా హెక్టారుకు రూ.32,500 సాయం అందించే పథకాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. రైతులకు ఏ పథకం ద్వారా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందో దానినే అమలు చేస్తామని అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
#APAssembly #GodavariFarmers #Razole #Atchannaidu #AgricultureNews #AndhraPradesh #DrainageSystem #CoconutFarming
