
- యూనస్ రాజీనామా యోచన…
- సైనికుల సమీకరణ
ఢాకా నగరాన్ని పొగమంచు కమ్ముకున్నట్లే,బంగ్లాదేశ్‌ను ఒక రాజకీయ అనిశ్చిత ముసురుకుంటోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని కొందరిలో ఆందోళన, కొందరిలో ఆసక్తి, ఏమైపోతామోననే భయం మరికొందరిలో నెలకొంది. పాకిస్తాన్‌లో చోటుచేసుకున్న సైనిక పాలన చరిత్రను గుర్తుచేసేలా, బంగ్లా రాజకీయ వాతావరణం అనూహ్య మలుపులు తిరుగుతోంది. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ చరిత్ర మళ్లీ పునరావృతమవుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన షేక్ హసీనాను ఎంత సులభంగా దేశ బహిష్కృతం చేయగలిగారో, యేడాది తిరగక ముందే ఆ పదవిని చేపట్టిన తాత్కాలిక ప్రధానమంత్రి ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్ తిరుగు టపా అవుతారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇందుకు కారణాలు, తార్కాణాలు చాలానే కనిపిస్తున్నాయి.
తాను తాత్కాలికంగా నియమించబడ్డ ప్రధానమంత్రిననే మాటను యూనస్ మరచినట్లున్నారు. పదవి చేపట్టిన వెంటనే ఆయన చేయాల్సిన పని ఏంటి? శాంతిభద్రతలను అదుపులోకి తీసుకువచ్చి, వెంటనే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన వారికి బాధ్యతలు అప్పగించిన తాను తప్పుకోవాల్సి ఉంది. కానీ, ఆయన తాను బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వెళ్ళిన దేశానికి వెళ్ళకుండా ఎక్కిన విమానం ఎక్కకుండా ప్రపంచ యాత్ర చేస్తున్నారు. ఇక్కడ దేశంలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. మతచాంధస్స వాదులు పెట్రేగి పోతున్నారు. మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి.
మరోవైపు ఆయన భారతదేశంపైకి కాలు దువ్వి బంగ్లా పరిస్థితులను మరింత దిగజార్చారు. ఇక అంతర్గ విషయాలకు వస్తే, యూనస్ ప్రభుత్వ తీరుపై సైన్యాధిపతి వాకెర్ ఉజ్-జమాన్ బహిరంగంగానే ఓసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో యూనస్ కూడా సైన్యానికి సలహాదారుగా మరొకరిని నియమించి పుండు మీద కారం చల్లారు. రాజకీయ సుస్థిరత కల్పించాలని, ఎన్నికలు నిర్వహించాలని సైన్యం ప్రశ్నిస్తే, తన అధికారాన్ని తగ్గించడానికి సైన్యాన్ని చీల్చడానికి యూనస్ ఎత్తులు వేస్తున్నారనే ఆలోచనకు వచ్చేవారు సైన్యాధిపతి.
యూనస్ సైనికుల సూచనలను వ్యతిరేకిస్తూ, ముఖ్యమైన పరిపాలన నియామకాలు, ఎన్నికల నిర్వహణ విషయంలో ఇష్టానుసారం వ్యవహరించడంతో, కోల్డ్ వార్ ప్రారంభమైందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. యూనస్‌కు సైన్యంతో నెలకొన్న విభేదాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్మీ చీఫ్ జనరల్ వాకెర్ ఉజ్-జమాన్ రాజకీయ స్థిరత సాధనపై నిరాశతో ఉన్నారని సమాచారం. గతంలో రాజకీయ వ్యవస్థపై పర్యవేక్షకులా వ్యవహరించిన సైన్యం, ఇప్పుడు బహిరంగంగా పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోందన్న సంకేతాలు వెలుగులోకి వస్తున్నాయి.
గాడి తప్పిన పాలన, మిన్నంటుతున్న ఆందోళనలు, ఎన్నికల నిర్వహణా డిమాండ్ల నేపథ్యంలో యూనస్‌కు నిప్పుల కొలిమిలో ఉన్నట్లవుతోంది. ఇదంతా స్వకృతాపరాధంలా కనిపిస్తోంది. ఈ క్రమంలో రాజకీయ పార్టీల మధ్య నమ్మకం లేకపోతే పాలన అసాధ్యమని జాతీయ పౌర పార్టీ (NCP) విద్యార్థి నాయకుడు నాహిద్ ఇస్లాంతో జరిగిన గోప్య సంభాషణలో యూనస్ వాపోయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నాహిది ఇస్లా బయటకు చెప్పారు. యూనస్ నాలుగుగోడల మధ్య ఇరుక్కుపోయినట్లు అనిపిస్తోందని వివరించారు.
అయితే సైన్యం ‘సాఫ్ట్ కూప్’ అంటే నేరుగా అధికారాన్ని చేజిక్కించుకోకుండా యూనస్ రాజీనామాకు పరోక్ష పరిస్థితులను కల్పిస్తోంది. తద్వారా ఒత్తిడి చేస్తోంది. తద్వారా పాలనను చేజిక్కించుకోవడం లేదా నియంత్రిత పరిపాలనను పొందే అవకాశాలున్నాయనే ఆందోళనలు పెరిగిపోతున్నాయి.
దేశంలో జరుగుతున్న పరిణామాలపై విద్యార్థులు, పౌర సమాఖ్యలు, సామాజిక కార్యకర్తలు ఆగ్రహంతో రోడ్డుపైకి వస్తున్నారు. మరోవైపు ఎన్నికల నిర్వహించాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంపై క్రమ క్రమంగా బంగ్లాదేశ్‌లో అనిశ్చిత్తి పెరుగుతోంది. ఇదే సైన్యానికి కావాల్సింది కూడా. ఇలాంటి పరిస్థితులలో దేశ పాలనను సైన్యం చేతిలోకి తీసుకోవడం సులభం అవుతుంది.
మొత్తంపై బంగ్లాదేశలో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది ఏం జరుగుతుందో వేచి చూడాలి.