వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరుస్వామి స్నపన తిరుమంజనం
శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలోని కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లకు శనివారం స్నపన తిరుమంజనం (పవిత్రస్నానం) శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రధాన కంకణభట్టర్ శ్రీ బాలాజి రంగాచార్యులు ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం నిర్వహించారు.
ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు,తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు.
ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున తామర పూలు, రోజా, తామర గింజలు, వివిధ రకాల సాంప్రదాయ పుష్పాలు, తులసీ తదితర ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు మునికుమార్, ధన శేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
#KalyanaVenkateswaraSwamy #Brahmotsavam #SnapanaTirumanjanam #SpiritualJourney #TTD #TirupatiNews #DevotionalAndhra #SrinivasaMangapuram
