
పలువురి మృతి – ఆస్తినష్టం
ఓ నివాస కాలనీ… అర్ధరాత్రి పూట నిద్రలోనే ఉలిక్కిపడింది. భూమి కంపించినట్లు అనిపించింది. తేరుకుని చూసే సమయానికి ఎగసిన మంటల్లో ప్రాణాలు కోల్పోయిన ఘోర దృశ్యం ఆ కాలనీవాసులకు కనిపించింది. ఇదంతా ఓ చిన్న ప్రైవేట్ జెట్ విమాన ప్రమాదంతో కనిపించిన భయంకర దృశ్యాలు.
రాత్రి 3:45 గంటల సమయంలో ఓ విమానం సాన్ డియాగోలోని మర్పీ కాన్యన్ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఇంటి పునాది పూర్తిగా ధ్వంసమై, రెండు వైపులా నిలిపిన కారు వాహనాలు దహనమయ్యాయి ఆ మంటలు పది ఇళ్లకు వ్యాపించాయి. ప్రమాద సమయంలో ఆ ప్రాంతాన్ని పొగమంచు కప్పేయడంతో, విమానం సమీప విద్యుత్ తీగను తాకినట్లు ప్రాథమిక అంచనాలో తెలుస్తోంది.
విమానంలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉండగా, వారిలో మ్యూజిక్ ఏజెంట్, సౌండ్ టాలెంట్ గ్రూప్ సహ-స్థాపకుడు డేవ్ షాపీరో మృతి చెందినట్లు గుర్తించారు. ఆయనతోపాటు సంస్థకు చెందిన ఇద్దరు సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్‌టీజీ ప్రతినిధి అమెరికా మీడియాకు తెలిపాడు.
స్థానికంగా నివసిస్తున్న యాస్మిన్ సియెరా అనే మహిళ తన చేదు అనుభవాలను తెలిపారు. “నాకు మొదట భూకంపం వచ్చిందేమో అనిపించింది. కానీ తీరా చూసేసరికి ఇంటి చుట్టూ పొగలు, మంటలు… చెట్లు కూడా అంటుకున్నట్లు కనిపించాయి,” అని పేర్కొన్నారు.
ఆమె తన ఇంటి తలుపు తీసి బయటకు వెళ్లేసరికి పొరుగింట్లోంచి అరుపులు వినిపించాయట. వెంటనే తన కుమారుడితో కలిసి నిచ్చెన వేసి, అక్కడ చిక్కుకుపోయిన మహిళ, ఇద్దరు పిల్లలు, రెండు చిన్న కుక్కలను రక్షించారు.
“ఆమె తీవ్ర భయంతో ఉండిపోయింది. ఆమెను నేనెత్తుకుని మా ఇంటి ముందు తీసుకువచ్చాను, వెంటనే ఈ ప్రాంతం వదిలేయాల్సిందే అన్నాను,” అని ఆమె వివరించారు.
“ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి మేమిద్దరం లేచాం. బయటికి చూశాం, ఆకాశం నారింజ రంగులో మెరిసిపోతుంది. ఆపై బయటకు వచ్చాను… మొత్తం కాలిపోయినట్లు కనిపించింది,” అని నావీ సభ్యుడు జెరెమీ సెర్నా చెప్పారు.
ఈ విమానం కాన్సాస్ నుండి వచ్చింది. మాంట్గోమెరీ-గిబ్స్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్ట్‌కి చేరే సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రదేశం అంతా విమాన శకలాలతో నిండి, ఫైబర్‌గ్లాస్ ముక్కలు, దహనమైన కార్ల అవశేషాలు చిమ్ముబడినట్లు కనబడింది.