హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) బుధవారం అర్ధరాత్రి భారీ బాంబు బెదిరింపు రావడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బహ్రెయిన్ నుంచి వస్తున్న గల్ఫ్ ఎయిర్ (Gulf Air 274) విమానం ల్యాండ్ అయ్యే సమయంలో టెర్మినల్స్‌లో పేలుడు సంభవిస్తుందంటూ వచ్చిన ఈమెయిల్ విమానాశ్రయ వర్గాలను పరుగులు పెట్టించింది. వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ, బాంబ్ స్క్వాడ్ మరియు పోలీసులు విమానాశ్రయమంతా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఎక్కడా ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో, అధికారులు దీనిని ‘హోక్స్’ (ఉత్తుత్తి బెదిరింపు) గా నిర్ధారించి ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఆర్‌జీఐఏ కస్టమర్ సపోర్ట్ విభాగానికి ఒక గుర్తు తెలియని మెయిల్ ఐడీ నుంచి సందేశం అందింది. “Blast in Hyderabad Airport Terminals When Gulf Air 274 From Bahrain Lands to RGIA” అనే టైటిల్‌తో ఉన్న ఆ మెయిల్ చూసిన సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. గల్ఫ్ ఎయిర్ విమానం ల్యాండ్ అయ్యే సమయానికే పేలుడు జరుగుతుందని హెచ్చరించడంతో, పోలీసులు విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించారు. టెర్మినల్స్, రన్‌వే మరియు పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి సోదాలు నిర్వహించారు.
ఇటీవలి కాలంలో అంతర్జాతీయ విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఈమెయిల్ బెదిరింపులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం భయాందోళనలు సృష్టించేందుకే గుర్తు తెలియని వ్యక్తులు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక ఉన్న ఐపీ (IP) అడ్రస్ ఏమిటి? అనే విషయాలను చేధించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. విమానాశ్రయ భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని, ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు స్పష్టం చేశారు.
