రేషన్ బియ్యం అక్రమ రవాణాలో నా పాత్ర లేదు
మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారం
నౌకల నిర్మాణం ఒక్కటే నా ఏకైక వ్యాపారం
శాన్ మెరైన్ సంస్థ అధినేత అలీషా వెల్లడి
ఈనెల అనగా 29.11.24, శుక్రవారం గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఎంకరేజ్ పోర్ట్ లో రేషన్ బియ్యం అక్రమ రవాణా తనిఖీలో భాగంగా అధికారులతో మాట్లాడుతున్న సందర్భంలో అలీషా ఎవరు అని మాత్రమే అడగడం జరిగిందని, తన గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదన్నారు, అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలతోపాటు, సోషల్ మీడియాలో తనకు రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధం ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని, ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదని శాన్ మెరైన్ సంస్థ అధినేత అలీషా తెలిపారు. పోర్టులో బియ్యం ఎగుమతి, దిగుమతి కి సంబంధించి లైసెన్స్ కూడా తనకు లేదని, తనకున్న ఏకైక వ్యాపారం నౌకలు తయారీ మాత్రమేనని, రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో కాకినాడ కేంద్రంగా గత 14 ఏళ్లుగా అంతర్జాతీయ ప్రమాణాలతో నౌకలు తయారు చేస్తూ దేశ విదేశాలకు అందించడం జరుగుతుందన్నారు, దీని ద్వారా ప్రత్యక్షంగా 500 మంది, పరోక్షంగా మరో మూడు వేల మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు, అలాగే కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే కు తనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని చేస్తున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు, ఒక వ్యాపారవేత్తగా అధికారంలో ఉన్న రాజకీయ నాయకులను కలవడం సహజమని అంతమాత్రాన వారి వ్యాపారాల్లో తనను భాగస్వామ్యం చేయడం సరికాదన్నారు. తన సంస్థ శాన్ మెరైన్ నౌకల తయారీలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకుందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నేవీ ఫ్లీట్ ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం శాన్ మెరైన్ సంస్థ పలుమార్లు దక్కించుకుని నేవీ కి సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు. కాకినాడ కేంద్రంగా నౌకల తయారీ కేంద్రాన్ని మరింత విస్తరించి స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని, ఈ సమయంలో తనపై లేనిపోని ఆరోపణ చేయడం పట్ల అలీషా ఆవేదన వ్యక్తం చేశారు. తాను నౌకలు తయారు చేస్తా తప్ప, నౌకల ద్వారా అక్రమ వ్యాపారాలు చేయడం తనకు తెలియదన్నారు. ఇప్పటికైనా మీడియా సోషల్ మీడియాలో తనపై అవాస్త కథనాలు ఆపాలని, లేని పక్షంలో చట్టప్రకారం ముందుకు వెళతానని అలీషా తెలిపారు. అలాగే త్వరలోనే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా కలిసి వివరణ ఇస్తానని అలీషా తెలిపారు