March 23, 2026

పొలంలో సాగు.. బయట విక్రయం: పోలీసుల పక్కా ప్లాన్!

పీటీఎం మండలం మల్లెల గ్రామంలో గంజాయి సాగు జరుగుతుందన్న పక్కా సమాచారంతో బి.కొత్తకోట పోలీసులు నిఘా పెట్టారు. ప్రధాన నిందితుడు వెంకటరమణారెడ్డి తన సొంత పొలంలోనే ఇతర పంటల మాటున గంజాయిని సాగు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు పంటను సిద్ధం చేసి, నలుగురు యువకుల సాయంతో విక్రయించేందుకు ప్లాన్ చేయగా, పోలీసులు మాటు వేసి అందరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

రూ. 10 లక్షల గంజాయి స్వాధీనం

నిందితుల వద్ద నుండి సుమారు 10 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 10 లక్షలు ఉంటుందని అంచనా. నిందితులపై ఎన్ డి పీఎస్ (NDPS) చట్టం కింద కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. వెంకటరమణారెడ్డితో పాటు ఆయనకు సహకరించిన సురేంద్ర, అఫ్రీద్, పురుషోత్తం, ఆదిల్ అనే యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఎస్పీ హెచ్చరిక: మత్తు వైపు వెళ్తే కఠిన చర్యలు

ఈ సందర్భంగా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి సాగు లేదా రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ముఖ్యంగా యువత భవిష్యత్తును నాశనం చేసే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని కోరారు.

పోలీసు బృందానికి అభినందనలు

చాకచక్యంగా వ్యవహరించి ఈ ముఠాను పట్టుకున్న మదనపల్లి డిఎస్పీ మహేంద్ర, బి.కొత్తకోట సీఐ గోపాల్ రెడ్డి, క్రైమ్ ఇన్స్‌పెక్టర్ చంద్రశేఖర్ మరియు వారి బృందాన్ని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. గంజాయి రహిత జిల్లాగా అన్నమయ్యను తీర్చిదిద్దేందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.
#AnnamayyaDistrict #GanjaSeized #Madanapalle #APPolice #DrugFreeAP #BreakingNews #CrimeNews #AnnamayyaUpdates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *