గంజాయి కొంటున్న ఇద్దరు అరెస్టు
గంజాయిని కొంటున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 1300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఈ మేరకు వివరాలను గురువారం పాతగుంటూరు పోలీస్‌స్టేషన్లో వెల్లడించారు. ఇస్రాయెల్‌పేట రైల్వేట్రాక్ పక్కన ఖాళీ స్థలంలో గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు ఆకస్మిక దాడులు నిర్వహించి ఇస్రాయెల్‌పేటకు చెందిన సయ్యద్ బాష, శారదా కాలనీకి చెందిన గుంజి గోపికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ గంజాయికి అలవాటుపడ్డారు. సీతానగరం 4వ లైనుకు చెందిన ముక్కోటి రాము అరకు నుండి గంజాయి తెచ్చి అమ్ముతుండగా బాష, గోపికృష్ణ కలిసి అతని వద్ద కొనుగోలు చేస్తుండడంతో పోలీసులు దాడులు చేసి కొనుగోలుదార్లను అరెస్టు చేశారు. గంజాయి కేసుల్లో తరచూ నిందితులుగా ఉన్న వారిపై పీడీ యాక్టు అమలు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. తాజా కేసులో నిందితులను అరెస్టు చేసిన పాత గుంటూరు సిఐ వెంకట ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్స్ రామారావు, మోహన్, నూరుద్దీన్‌ను అభినందించారు.
#GunturPolice #AntiDrugs #GanjaBust #AndhraPradeshCrime #SayNoToDrugs #PoliceAction #GunturNews
