ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించి ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి సరికొత్త ఊపిరి పోశారు. ఏడాది క్రితం ఒక ఉద్యమంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం కేవలం ప్రభుత్వానికే పరిమితం కాకుండా, ప్రతి పౌరుడి జీవన విధానంలో భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
మార్చి 2026 నాటికి రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన కోటి 12 లక్షల టన్నుల చెత్తను పూర్తిగా తొలగించి, ఆంధ్రప్రదేశ్‌ను ఒక ఆదర్శవంతమైన స్వచ్ఛమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులతో ముచ్చటించిన సీఎం, వారి సేవలను కొనియాడారు.
చెత్త నుంచి సంపద.. ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్రాజెక్టులు
రాష్ట్రంలో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరులలో విజయవంతంగా నడుస్తున్న ‘చెత్త నుంచి విద్యుత్’ (Waste to Energy) తయారు చేసే ప్రాజెక్టులను త్వరలోనే కర్నూలు, రాజమహేంద్రవరం, కడప, నెల్లూరు జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
“వారానికి ఒకసారి ప్రతి ఇంటి వద్దకు స్వచ్ఛ రథాలు వచ్చేలా చూస్తున్నాం. ప్రజల నుంచి చెత్తను సేకరించి, దానికి బదులుగా నిత్యావసర వస్తువులు ఇచ్చే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం” అని ఆయన వివరించారు.
2018లోనే రాష్ట్రాన్ని బహిరంగ మల విసర్జన రహిత (ODF) రాష్ట్రంగా మార్చామని, ఇప్పుడు ‘ODF Plus’ లక్ష్యం దిశగా పయనిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ దోపిడీపై ఘాటు విమర్శలు
నగరి బహిరంగ సభలో చంద్రబాబు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లలో ఇసుక, గనులు, మద్యం.. ఇలా ప్రతి రంగంలోనూ భారీ దోపిడీ సాగిందని ఆరోపించారు. చివరికి పవిత్రమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదంలోని నెయ్యిని కూడా కల్తీ చేశారని మండిపడ్డారు. “నేను చేస్తున్న మంచి పనులకు క్రెడిట్ చోరీ చేస్తున్నానని కొందరు విమర్శిస్తున్నారు.
కానీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసేవారికి నీతులు చెప్పే అర్హత లేదు” అని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజల ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, నేరస్థుల చేతుల్లో రాజకీయాలు ఉంటే అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన హెచ్చరించారు.