అన్నమయ్య పద సంపదను భావితరాలకు అందించాలి
– డా.మేడసాని మోహన్
– అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీమాన్ గౌరి పెద్ది రామసుబ్బశర్మ 35వ వర్ధంతి
శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు తెలుగు పద సాహిత్యానికి ఆద్యుడని, ఆయన పద సంపదను భావితరాలకు అందించడంలో శ్రీమాన్ గౌరి పెద్ది రామసుబ్బశర్మ చేసిన కృషి చిరస్మరణీయమని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా.మేడసాని మోహన్ చెప్పారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో బుధవారం శ్రీ గౌరి పెద్ది రామసుబ్బశర్మ 35వ వర్ధంతి సభ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సుకు అధ్యక్షత వహించిన డా.మేడసాని మోహన్ మాట్లాడుతూ, రత్నంను గుర్తించాలంటే రత్నంను పరీక్షించడం తెలిసిన వాడై ఉండాలన్నారు. అదేవిధంగా శ్రీవారికి పరమ భక్తుడైన అన్నమాచార్యులవారు గానం చేసిన పద కవితలను విశ్లేషించి చెప్పాలంటే, శ్రీవారి భక్తుడైన గౌరిపెద్ది రామసుబ్బశర్మ పరిష్కరించారన్నారు. అన్నమాచార్యులవారు గానం చేసిన సంకీర్త నాలను గౌరిపెద్ది వారు స్పష్టంగా తెలియజేశారని చెప్పారు.
తాళపత్రాల ద్వారా సుమారు 300 అన్నమయ్య కీర్తనలు వెలుగులోకి వచ్చాయన్నారు. తామ్ర(రాగి) పత్రాల ద్వారానే ఎక్కువ కీర్తనలు మనకు లభించాయన్నారు. తిరుమలశ్రీవారి ఆలయంలోని ఐదు బండరాళ్లపై చెక్కిన శాసనాల ద్వారా కొన్నికీర్తనలు 1949లో వెలుగులోకి వచ్చాయని వివరించారు.
తిరుపతి ఎస్వీ ప్రాచ్య పరిశోధనా సంస్థ విశ్రాంత ఆచార్యులు ఆచార్య గోవిందరాజు “ తాళ్ళపాక పదకవుల సంకీర్తనల పరిష్కర్తలు – గౌరిపెద్దివారి పాత్ర ” అనే అంశంపై ఉపన్యసిస్తూ, శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ సాధారణ రాగిరేకుల్లోని తాళ్లపాక కవుల సాహిత్యాన్ని పరిష్కరించి వెలుగులోకి తెచ్చారన్నారు. వేటూరి ప్రభాకరశాస్త్రి తర్వాత రామసుబ్బశర్మ విశేష కృషి ఫలితంగా వంద రేకుల సాహిత్యానికి ఒక సంపుటం చొప్పున 4 సంపుటాలను పునఃప్రచురించారని చెప్పారు. ఇందుకోసమే 1979లో గౌరిపెద్ది రామసుబ్బశర్మను ప్రత్యేకాధికారిగా అన్నమయ్య వాఙ్మయ ప్రాజెక్టును ఏర్పాటు చేసినట్లు వివరించారు.
అనంతరం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సాహితీవేత్త శ్రీ శంకర్ రావు `శ్రీ తాళ్లపాక పద సాహిత్య పరిష్కరణ – గౌరిపెద్దివారి కృషి ` అనే అంశంపై ఉపన్యసించారు. అద్భుతమైన సాహితీ సృజన చేసిన ప్రముఖులలో శ్రీ గౌరిపెద్ది ఒకరని అన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలు 27 సంపుటాలు పరిష్కరించడంలో గౌరిపెద్ది వారు విశేష కృషి చేశారన్నారు. మహాభారత ఇతిహాసాన్ని అపూర్వ సాహిత్యంతో అందించిన కవిత్రయం లోని తిక్కన పాత్రను పోలి తాళ్లపాక సంకీర్తనలను సింహభాగం పరిష్కరించి గౌరిపెద్ది రామసుబ్బశర్మ భక్తలోకానికి అందించారని వివరించారు. శ్రీ గౌరిపెద్ది వేంకట శంకర భగవాన్ గారు మాట్లాడుతూ అన్నమయ్య అన్నమయ్య వైష్ణవం, శ్రుతి ప్రధాన విషయాలపై ప్రసంగించారు.
అంతకుముందు ఉదయం 9 గంటలకు ఎస్వీ ఓరియంటర్ కాలేజీ పరిసరాలలో ఉన్న శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ విగ్రహానికి టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా.మేడసాని మోహన్ పుష్పాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గౌరిపెద్ది శంకర భగవాన్, గౌరిపెద్ది కుటుంబ సభ్యులు అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు లత, ప్రోగ్రాం అసిస్టెంట్ కోకిల, ఇతర అధికారులు, పురప్రజలు పాల్గొన్నారు.
#Annamayya #GauripeddiRamasubbaSharma #Tirupati #TTD #TeluguLiterature #MedasaniMohan #AnnamacharyaProject #SpiritualTelugu #TallapakaPoets
