ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిరక్షణలో మైలురాయిగా నిలిచే ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ’ (Great Green Wall of AP) ప్రాజెక్టుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలోని 1,034 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పుతో దట్టమైన పచ్చదనాన్ని (Green Belt) అభివృద్ధి చేయడమే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. 2030 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం గ్రీన్ కవర్‌ను సాధించాలని, ఈ ప్రాజెక్టు ద్వారా అటు జీవవైవిధ్యాన్ని కాపాడటంతో పాటు ఇటు తీరప్రాంత ప్రజల జీవనోపాధిని మెరుగుపరచవచ్చని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
తీరప్రాంతానికి అభయారణ్యం.. లక్ష్యం 2030
పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న ప్రస్తుత తరుణంలో, భవిష్యత్ తరాలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడమే ధ్యేయంగా పవన్ కల్యాణ్ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నారు. “ఒక క్రీడాకారుడు మైదానంలో పట్టుదలతో ఆడి విజయం సాధించినట్లు, మనం కూడా పట్టుదలతో 2030 నాటికి ఈ పచ్చని గోడను నిర్మించాలి” అని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర తీరప్రాంతంలో మడ అడవులు, ఇతర స్థానిక మొక్కలను పెంచడం ద్వారా సముద్రపు కోతను అరికట్టవచ్చని, తుపానుల ప్రభావాన్ని తగ్గించవచ్చని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టులో స్థానిక మత్స్యకారులను మరియు గిరిజనులను భాగస్వాములను చేయడం ద్వారా వారికి అదనపు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
50% పచ్చదనం దిశగా అడుగులు
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని భారీగా పెంచేందుకు ‘50% గ్రీన్ కవర్’ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, వాటి మనుగడను ట్రాక్ చేసేందుకు ఆధునిక సాంకేతికతను (Geo-tagging) ఉపయోగించాలని సూచించారు.
పరిశ్రమల నుండి వచ్చే కాలుష్యాన్ని అరికట్టేందుకు కూడా ఈ గ్రీన్ బెల్ట్ సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పర్యవరణ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణ మరియు కేంద్ర ప్రభుత్వ సహకారంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. పర్యావరణం అంటే కేవలం చెట్లు మాత్రమే కాదని, అది మన మనుగడకు ప్రాణాధారమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.