తన తల్లి మరొకరితో వివాహేతర సంబంధంలో ఉండడాన్ని కొడుకు భరించలేకపోయాడు. తన తల్లితో తిరుగుతున్న వ్యక్తి హతమార్చాలనుకున్నాడు. తన ప్రియుడిని కాపాడాలనుకుంది తల్లి. చివరకు కన్న కొడుకు చేతిలో హతమయ్యింది. హృదయ విదారకమైన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్‌లో రజిని (40) తన కొడుకుతో కలసి జీవనం సాగిస్తోంది. అయితే, తల్లి మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయంపై కొడుకు కక్ష పెంచుకున్నాడు. కుటుంబ గౌరవాన్ని బజారున పడేశారన్న ఆగ్రహంతో తన తల్లితో వివాహేతర సంబంధం కలిగి ఉన్న వ్యక్తిని కడతేర్చాలనుకున్నాడు. అయితే తల్లి అడ్డురావడంతో ఆమెనే హతమార్చాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నిందితుడైన కొడుకుతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
పథకం ప్రకారం ఇంటికి పిలిచి.. ప్రియుడిపై హత్యా ప్రయత్నం
తన తల్లితో సంబంధం పెట్టుకున్నాడని భావిస్తున్న వ్యక్తిని చంపేందుకు నిందితుడు ఒక పక్కా ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా సదరు వ్యక్తిని తమ ఇంటికే పిలిచి మందు తాగించాడు. అందరూ కలిసి మద్యం సేవించిన తర్వాత గొడవ మొదలుపెట్టి, తన వద్ద ఉన్న కత్తితో ఆ వ్యక్తిని హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో గొడవను ఆపేందుకు తల్లి రజిని అడ్డురావడంతో, ఆవేశంతో ఊగిపోయిన కొడుకు ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఈ హత్య పూర్తిగా వివాహేతర సంబంధం నేపథ్యంలో పెంచుకున్న పగ వల్ల జరిగినట్లు తెలుస్తోంది. నిందితుడు కొంతకాలంగా గంజాయికి అలవాటు పడి ఉండటం కూడా అతని హింసాత్మక ప్రవృత్తికి తోడైంది. రక్తపు మడుగులో పడి ఉన్న రజినిని గమనించిన స్థానికులు తక్షణమే ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది.
సమాచారం అందుకున్న జవహర్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. నిందితుడికి సహకరించిన మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల అరెస్ట్.. లోతుగా విచారణ
ఈ ఘటనతో బాలాజీ నగర్ లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. వివాహేతర సంబంధం చివరకు ఒక ప్రాణాన్ని బలి తీసుకోవడంపై చర్చ జరుగుతోంది. పోలీసులు నిందితుడైన కొడుకుతో పాటు అరెస్టయిన నలుగురిపై హత్య మరియు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్రైనా ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
#HyderabadCrime #JawaharNagar #FamilyDisputes #MurderCase #BreakingNews #CrimeAlert
