వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెనుజులా రాజకీయ సంక్షోభాన్ని ఉదహరిస్తూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది; ప్రజాదరణ ఉన్న నేత చుట్టూ ఉన్న వ్యవస్థలు అమ్ముడుపోతే, అగ్రరాజ్యాలు ఎంతటి వారినైనా బందీలను చేస్తాయని ఆయన పేర్కొనడం చర్చనీయాంశం అయ్యింది. ఆయన ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు? ఎవరిపై ఆ వ్యాఖ్యలు చేశారు? అనే ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. పరోక్షంగా భారతీయ జనతా పార్టీ (BJP) కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి విపక్ష నేతలను ఇబ్బంది పెడుతోందనే అర్థం ధ్వనింపజేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వ్యవస్థల వైఫల్యం
ఎక్స్‌లో ఆయన వెనుజులా అధ్యక్షుడు మదురోను అమెరికా బలగాలు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి ఎటువంటి ప్రతిఘటన లేకుండా తీసుకెళ్లడాన్ని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. సైన్యం, నిఘా వర్గాలు, ఆయుధ సంపత్తి అన్నీ ఉన్నా.. ఆ వ్యవస్థల అధిపతులు అమ్ముడుపోవడం వల్లే ఆ దేశ నేతకు ఈ గతి పట్టిందని ఆయన విశ్లేషించారు. ఇక్కడ ఆయన “అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి” అని సంబోధించడం ఆసక్తికరం.
ఇది రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలకు, ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న పరిస్థితులకు లేదా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న నేతలకు వర్తింపజేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పోస్ట్ నేరుగా బీజేపీని లక్ష్యం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో బీజేపీతో సఖ్యతగా ఉన్నట్లు కనిపించిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు “అమెరికా తీసుకెళ్లిందంటే కారణం ఏమిటి?” అని ప్రశ్నించడం ద్వారా..
కేంద్రంలో అధికారంలో ఉన్నవారు తమకు నచ్చని నేతలను వ్యవస్థల ద్వారా ఎలా అణచివేస్తారో చెప్పకనే చెప్పారు. ఇది కేవలం అంతర్జాతీయ విశ్లేషణ మాత్రమే కాదు, దేశంలోని దర్యాప్తు సంస్థల (ED, CBI) పనితీరుపై ఒక నిగూఢమైన విమర్శగా కూడా చూడవచ్చు.
తన చుట్టూ ఉన్న వారు ఎప్పుడైనా ప్లేటు ఫిరాయించవచ్చని, అప్పుడు ఎంతటి ప్రజాదరణ ఉన్నా ప్రయోజనం ఉండదనే చేదు నిజాన్ని ఆయన తన పార్టీ నేతలకు లేదా విపక్షాలకు గుర్తుచేస్తున్నారు. మద్యం కేసులో తనకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22న ఆయన ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది.
ఈ తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పరోక్షంగా హెచ్చరిస్తారా? లేక వ్యవస్థలను బీజేపీ వాడుకుంటున్న విధానాన్ని ఎత్తి చూపుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
భవిష్యత్తు పరిణామాలపై హెచ్చరిక
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. “భవిష్యత్తులో ఇక్కడ మీకూ ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి” అనడం ద్వారా.. రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో ఏదైనా పెను మార్పు రాబోతోందా? లేదా కీలక నేతలపై కేంద్ర సంస్థలు మరిన్ని కఠిన చర్యలు తీసుకోబోతున్నాయా? అన్న చర్చ మొదలైంది. ఎవరిపై కేంద్రం జగన్‌పై పడుతుందా?
వెనుజులాలో మదురో ప్రభుత్వం పతనం కావడాన్ని, ఇక్కడ విపక్షాల అణచివేతకు ఉదాహరణగా ఆయన చూపిస్తున్నారు. అమెరికాను విమర్శించే సాకుతో ఆయన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తన అసంతృప్తిని వెళ్లగక్కారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.