విజయవాడ, శ్రీశైలంలోని కృష్ణా నదీపరివాహక ప్రాంతంలో సీ ప్లేస్ సర్వీసులు
వచ్చేనెల 9న సీప్లేస్ సర్వీసుల ప్రారంభం
ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధి వేగంగా జరిగేందుకు పునాదులు పడుతున్నాయి. ఉన్న కోస్తా ప్రాంతాన్ని అలాగే నదీ పరివాహక ప్రాంతాలను ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలను ఆధ్యాత్మిక కేంద్రాలను దృష్టిలో ఉంచుకొని రకరకాల పథకాలను అమలుపరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోంది. మాల్దీవుల తరహాలో సీ ప్లేన్లు నడపడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి అంత ఆశాజనకంగా లేకపోయినా, నిధులు వచ్చే వరకు వేచి చూడకుండా చిన్న చిన్న పథకాలు, ప్రాజెక్టులను పర్యాటక శాఖ అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందుకు ఉదాహరణ టెంపుల్ టూరిజం, ఫ్లోటింగ్ హోటల్స్ ని చెప్పవచ్చు.
వీటి అమలుకు పెద్దగా నిధులు అవసరం లేకపోవడంతో ప్రభుత్వం వీటిని వెంటనే ప్రారంభించింది. ప్రభుత్వం వీటికి ఇస్తున్న ప్రోత్సాహాన్ని చూస్తున్న ఇతర సంస్ధలు కూడా తీర ప్రాంతాల్లో, నదీ పరీవాహక ప్రాంతాల్లో టూరిజం ప్రాజెక్టులు అమలు చేయడానికి ముందుకు వస్తున్నాయి.
గాలిలో ఎగర గలిగే, నీటిపై తేలగలిగే, ఎక్కడైనా ల్యాండ్ అవ్వగలిగే కెపాసిటీ ఉన్న సీ ప్లేన్స్ ద్వారా పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
అమెరికా, మాల్దీవులు వంటి దేశాలు సీ ప్లేన్స్ సర్వీసులను సముద్రంలోనూ, నదుల్లోను ప్రవేశపెట్టాయి. వారాంతాలు, పండుగలు, సెలవు దినాల్లో సీ ప్లేన్స్ సర్వీసులను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చాయి.
అదే తరహాలో నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానం పరిధిలోని శ్రీశైలం పాతాళగంగలోని కృష్ణానది , బెజవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ల్యాండింగ్ పాయింట్లుగా సీ ప్లేన్ సర్వీసును ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
ఇందులో భాగంగానే శ్రీశైలంలో నవంబర్ 9న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటించనున్నారు. లాంఛనంగా సీప్లేన్ సర్వీసును ప్రారంభించనున్నారు.
ఈ ప్లేన్ సర్వీస్ కోసం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కృషి చేశారు. గాలిలో ఎగర గలిగే, నీటిపై ల్యాండ్ అవ్వగలిగే కెపాసిటీ ఉన్న ఈ సీ ప్లేన్స్ అమెరికా, మాల్దీవులు వంటి దేశాలలో పర్యాటకంగా అభివృద్ధికి ఈ సర్వీసులు ఎంతగానో దోహదం చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరప్రాంతం అధికంగా ఉన్న నేపథ్యంలో పర్యాటకంగా ఏపీకి ఇది బాగా ఉపయోగపడుతుందని రామ్మోహన్ నాయుడు ఈ ప్రాజెక్టు ఏపీకి వచ్చేలా కృషిచేశారు.
ఈ విమానాలు పర్యాటకంగానే కాకుండా మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో, ఏవైనా ప్రకృతి విపత్తుల సమయంలో కూడా ఉపయోగపడతాయి. కేంద్రం సీ ప్లేన్ విధానాన్ని ప్రవేశపెట్టిన వెంటనే దానిని ఏపీలో అమలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. సీప్లేన్ అందుబాటులోకి వస్తే పర్యాటకంగా అటు విజయవాడ, ఇటు శ్రీశైలంకు మంచి బూస్టప్ అవుతుంది. పర్యాటకులు ఒకే రోజు తక్కువ వ్యవధిలో రెండు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం లభిస్తుంది.