తెలుగుదేశం పార్టీ అంటే నందమూరి కుటుంబం, నందమూరి కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీ. ఇది నిజం. నందమూరి వారు ఆ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నా లేకపోయినా.. ఇదే సత్యం. ఆ పార్టీ జనం సెంటిమెంటు. మరి ఆ కుటుంబానికి చెందిన మాజీ ఎంపి కుమారుడు, ఒక హీరో కార్యాక్రమానికి తెలుగుతమ్ముళ్ళు హాజరు కాలేదంటే నమ్ముతారా? అయ్యో… అది కష్టమండి. సాధ్యం కాదు. తెలుగు తమ్ముళ్లు లేకుండా నందమూరి కుటుంబ వారసుల కార్యక్రమాలా? ఏం మాట్లాడుతున్నారు. ఇదే కదా మీరు అనబోయేది. కానీ, మీకు నచ్చినా.. నచ్చకపోయినా.. మీరు నమ్మినా… నమ్మకపోయినా.. అదే జరిగింది. ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ కాకినాడ పర్యటనకు వచ్చారు. నందమూరి వారు నిర్మించిన ప్రజారథం రథసారధి, మాజీ ఎంపి, మాజీ మంత్రి హరికృష్ణ కుమారుడు వస్తే రాకుండా ఉంటారా? మళ్ళీ అదే ఆశ్చర్యం. కానీ, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు , కనీసం మర్యాదపూర్వకంగా కూడా పలకరించేందుకు భయపడ్డారు. ముఖం చాటేశారు. పార్టీ అధిష్టానం వద్ద ‘మార్కులు’ తగ్గుతాయనే ఆందోళన తమ్ముళ్లలో స్పష్టంగా కనిపించింది.
పొలిటికల్ భయం – ముఖం చాటేసిన ఎమ్మెల్యేలు
కాకినాడలో మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుటుంబ సభ్యుల రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి కళ్యాణ్ రామ్ తన కుటుంబంతో సహా విచ్చేశారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడే ఉన్నప్పటికీ, అధికార పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయన దరిదాపుల్లోకి వెళ్లకపోవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా నందమూరి కుటుంబం నుంచి చిన్న హీరో వచ్చినా నానా హంగామా చేసే టీడీపీ కేడర్, ఈసారి కళ్యాణ్ రామ్ విషయంలో మౌనం వహించడం వెనుక అధిష్టానం నుంచి వచ్చిన అప్రకటిత ఆదేశాలే కారణమని భావిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ విషయంలో గతంలోనే దూరం పెంచుకున్న పార్టీ నేతలు, ఇప్పుడు అదే జాబితాలోకి కళ్యాణ్ రామ్‌ను కూడా చేర్చినట్లు కనిపిస్తోంది. పైన పరిస్థితులు బాగోలేనప్పుడు తాము వెళ్లి పలకరిస్తే, తమ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ దెబ్బతింటుందోననే భయం ద్వితీయ శ్రేణి నాయకుల్లో సైతం స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే, ఈ గందరగోళం మధ్య ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే వర్మ మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం. రామరాజు తన కుటుంబ సభ్యుల భాగస్వామ్యం కోసమే వెళ్లగా, వర్మ మాత్రం తనకు ఎటువంటి ‘బౌండరీలు’ లేవని, మర్యాద కోసం కలవడంలో తప్పులేదని తెగేసి చెప్పినట్లు సమాచారం. కానీ, మిగిలిన నేతలు మాత్రం “మేము బాగున్నప్పుడే మర్యాదలు బాగుంటాయి, అనవసరంగా వెళ్లి తలనొప్పులు తెచ్చుకోలేము” అంటూ అనుచరులకు దండం పెడుతున్నారట. ఎవరైనా అభిమానులు కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలు పెట్టినా, అందులో తమ పేర్లు లేదా ఫోటోలు ఉండకుండా చూసుకోవాలని నేతలు ముందే జాగ్రత్త పడటం, పార్టీలో నందమూరి బ్రదర్స్ పట్ల ఉన్న ప్రస్తుత వ్యతిరేకతను ప్రతిబింబిస్తోంది.
మారుతున్న సమీకరణలు – నందమూరి వారసుల భవితవ్యం
ఎంత ఘనత వహించిన కుటుంబం అయినా… ఎంత పేరు మోసిన వంశమైనా విభేదాలు తగాదాలు సర్వ సాధారణం. ఇక్కడా అదే జరిగింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు నందమూరి హరికృష్ణ మొదట్లో బాసటగా నిలిచినా, ఆ తరువాత వ్యతికించారు. విభేదించారు. ఇది నిజం. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం జూనియర్ ఎన్టీయార్ కాలికి బలపం కట్టుకొని రాష్ట్రమంతటా ప్రచారం చేశారు.ఎక్కడ బెడిసి కొట్టిందో తెలియదుగానీ, చిన్నబాబు నారా లోకేష్ కు జూనియర్ ఎన్టీయార్‌కు మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుదనే విషయం తెలిసిందే. కానీ చంద్రబాబు నాయుడు కొంత సమతుల్యత పాటిస్తూ వచ్చారు. అయినా వీరి మధ్యన సయోధ్య కుదిరినట్లు లేదు. ఆ ప్రభావం నందమూరి హరికృష్ణ కుటుంబంపై పడినట్లుంది. వాస్తవానికి కళ్యాణ్ రామ్ వివాదరహితుడైన హీరో అనే పేరుంది.
అయినా కూడా కలవడానికి భయపడుతున్నారంటే, పార్టీలో ఎంతటి కఠినమైన నిబంధనలు లేదా సంకేతాలు అమలవుతున్నాయో ఊహించవచ్చు. కారణం జూనియర్ ఎన్టీయార్ కు అన్న కావడమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. కార్యకర్తలు బలవంతం చేసినా, “అనుభవించే మాకే తెలుస్తుంది, మమ్మల్ని బలి చేయకండి” అంటూ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, టీడీపీలో నందమూరి కుటుంబ సభ్యుల ప్రాధ్యాన్యత క్రమంగా తగ్గుతోందా లేక వారిని కావాలనే పక్కన పెడుతున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఈ సంఘటన కేవలం ఒక రెస్టారెంట్ ప్రారంభోత్సవానికే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో టీడీపీ మరియు నందమూరి కుటుంబం మధ్య ఉండబోయే సంబంధాలకు ఒక దిక్సూచిగా మారింది. అభిమానం ఒకవైపు, రాజకీయ అవసరాలు మరొకవైపు ఉన్న తరుణంలో తెలుగు తమ్ముళ్లు తమ స్టైల్‌లో సేఫ్ గేమ్ ఆడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోదరులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా? లేక వారిని దూరంగా ఉంచుతున్నారా? అన్నది పక్కన పెడితే, స్థానిక నాయకుల ప్రవర్తన మాత్రం అధిష్టానానికి విధేయత చాటుకోవడమే పరమావధిగా సాగుతోంది. నందమూరి వారసులకు మరియు పార్టీకి మధ్య ఉన్న ఈ గ్యాప్ భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
#TDPPolitics #NandamuriKalyanRam #KakinadaTDP #JuniorNTR #NandamuriVsTDP
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.