రాయలసీమ ప్రాంతపు దశాబ్దాల కరవును పారద్రోలేందుకు సంకల్పించిన ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ (RLIS) ఇప్పుడు అంతరాష్ట్ర జల వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును అక్రమమైనదిగా అభివర్ణించడమే కాకుండా, ఏపీ ప్రభుత్వంతో జరిగిన అంతర్గత చర్చల్లో దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేయడం సీమప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కృష్ణా నది నుంచి తన చట్టబద్ధమైన 144.7 టీఎంసీల నీటి వాటాను వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సాంకేతిక సవాళ్లకు ఈ పథకమే ఏకైక పరిష్కారమని నీటిపారుదల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో తీవ్రమైన పూడిక పేరుకుపోయి నీటి మట్టం పడిపోతున్న తరుణంలో, 800 అడుగుల నుంచే నీటిని తోడే సామర్థ్యం ఉన్న ఈ ఎత్తిపోతల పథకం పూర్తయితేనే గాలేరు-నగరి, హంద్రీ-నీవా వంటి ప్రాజెక్టులకు జీవం వస్తుంది. రాజకీయ విమర్శల ముసుగులో సీమ హక్కులను కాలరాయకుండా, శాస్త్రీయ ఆధారాలతో కేంద్ర జల సంఘం వద్ద తన వాదనను గట్టిగా వినిపించి, ఈ ప్రాజెక్టుకు మిగిలి ఉన్న అనుమతులను సాధించడమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం.
అంతరాష్ట్ర రాజకీయాలు – రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
తెలంగాణలో ఎప్పుడు రాజకీయ వ్యూహాలు ప్రతివ్యూహాల పరిస్థితి ఏర్పడ్డా, పార్టీ ఏదైనా, నాయకుడు ఎవరైనా రాయలసీమ నీటి పథకాల మీద విరుచుకుపడి తమ రాజకీయ పబ్బం గడుపుకుంటారు. ఈ పర్యాయం తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అదే పని చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రాజెక్టును అక్రమం అని ప్రకటించడం ద్వారా రాజకీయ పైచేయిని సాధించాలని చూస్తున్నారు. ఆయన మాటలకు చేతలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 800 అడుగుల కంటే తక్కువ మట్టం నుండి నీటిని లిఫ్ట్ చేసే అనేక ప్రాజెక్టులను నిర్మించుకుంది. తాను చేస్తే సంసారం, ఇంకొక రాష్ట్రం చేస్తే వ్యభిచారం అన్నట్ల వ్యవహరిస్తున్నారు తెలంగాణ నాయకులు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాయకులు దీనిని తిప్పికొట్టడంలో ఏనాడు, ఏ పార్టీ, ఏ నాయకుడు కూడా తెగింపు దోరణిలో వ్యవహరించలేదు. సరియైన సమాధానం చెప్పడంలో లేదు. ఇది దశాబ్దాలు ఇదే ధోరణి కనిపిస్తోంది. కారణం వీరి ఆస్తులు తెలంగాణ, వీరుంటున్నది తెలంగాణ. అందుకే రాష్ట్ర ప్రయోజనాలను, రాయలసీమ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు. ఇది కేవలం నీటి సమస్య మాత్రమే కాదు, రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న రాజకీయ ఆధిపత్య పోరుకు నిదర్శనం.
గత ప్రభుత్వం అనుమతులు లేకుండా పనులు చేసిందనే విమర్శలను తెలంగాణ ప్రభుత్వం తన వాదనకు ఆయుధంగా మలచుకుంటోంది. ఈ రాజకీయ రొంపిలోకి ప్రాజెక్టును లాగడం వల్ల సీమ ప్రజలు బలిపశువులవుతున్నారు. ఏపీ ప్రభుత్వ పెద్దలు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, ఈ పథకం ఆవశ్యకతను జాతీయ వేదికలపై చాటి చెప్పాలి. ఇది కేవలం ఒక ప్రభుత్వ నిర్ణయం కాదు, రాయలసీమ ప్రాంతపు మనుగడకు సంబంధించిన అంశం అని నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది.

శ్రీశైలం పూడిక సంక్షోభం – 800 అడుగుల వద్ద ఎత్తిపోతల ఆవశ్యకత
శ్రీశైలం జలాశయం ఇప్పుడు తన నిల్వ సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతోంది. ఒకప్పుడు 315 టీఎంసీలుగా ఉన్న దీని సామర్థ్యం, పూడిక కారణంగా 200 టీఎంసీల కెపాసిటీకి పడిపోయింది. దీనివల్ల పోతిరెడ్డిపాడు నుంచి నీటిని మళ్లించాలంటే ఉండాల్సిన 854 అడుగుల మట్టం నిర్వహించడం ఇప్పుడు అసాధ్యంగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించడానికే 800 అడుగుల మట్టం నుంచే నీటిని తీసుకునేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. ప్రాజెక్టులో అనివార్య పరిస్థితులు ఏర్పడినప్పుడు లేదా భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎగువన నీటి నిల్వ ఏర్పాట్లు చేసుకోవచ్చన్న సిడబ్ల్యూసీ (CWC) సిఫార్సులను ఏపీ ప్రభుత్వం, ఏపి నాయకులు బలంగా వినిపించాలి. అదే సమయంలో 800 అడుగుల స్థాయి నుంచి తెలంగాణ నీటిని తోడుకుంటున్న సంఘటనలను ఉదంతాలను వెలికి తీసి బాహ్య ప్రపంచానికి చెప్పాలి. అధికార వేదికల ముందు ఉంచాలి. కానీ, ఆ పని ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు సమర్థవంతంగా చేయలేకపోతున్నారు.
కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం జలాశయాన్ని ఖాళీ చేయడం వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు నీరు అందకుండా పోతోంది. విద్యుత్తు ఉత్పత్తి కూడా కనీస నీటి నిల్వలు నిర్ణీత స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. లేకపోతే నీరు వృధా అవుతుంది. తెలంగాణ ఈ నియమాన్ని పాటించకపోగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయలసీమ పథకాలపై అక్కసు వెళ్లగక్కుతోంది. తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నేటికీ రాయలసీమను పావు వాడుకుంటోంది. నెలల తరబడి కృషలో పారే నీరు ప్రస్తుతం కేవలం కొన్ని వారాలకే పరిమితమవుతోంది. ఆ కొద్ది రోజుల్లోనే రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని తరలించగలిగితేనే సీమ రిజర్వాయర్లు నిండుతాయి. నీళ్ళే రాక, విద్యుత్త ఉత్పత్తి కోసం నీటిని వదిలేస్తుంటే రాయలసీమ అవసరాలు తీరేదెలా? ముచ్చుమర్రి వంటి పాత ఎత్తిపోతల కేంద్రాలు రోజుకు కేవలం 0.25 టీఎంసీలనే తరలించగలవు, ఇది రాయలసీమ దాహార్తిని తీర్చడానికి ఏమాత్రం సరిపోదు. అందుకే సాంకేతిక పరంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఈ ప్రాంతానికి ఒక అనివార్యమైన నిర్మాణం.
సీమ సాగునీటి వ్యవస్థపై ప్రభావం
ఈ పథకం పూర్తయితే గాలేరు-నగరి మరియు హంద్రీ-నీవా ప్రాజెక్టులకు ఒక శాశ్వత భరోసా లభిస్తుంది. రాయలసీమకు దక్కాల్సిన 144.7 టిఎంసీల నికర జలాల్లో కేవలం సగం నీరు మాత్రమే ప్రస్తుతం వాడుకోగలుగుతున్నారు. అధికారకంగా కేటాయింపుల ప్రకారం అందాల్సిన నీరు కూడా అందక రాయలసీమ విలవిలలాడుతుంటే, ఆ ప్రాంత ప్రాజెక్టులపై తెలంగాణ విషం చిమ్మడం, దానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు భరించడం ఏంటి? అరకొర నీటి కారణంగా ఇప్పటికే వేల కోట్ల రూపాయల పంట నష్టం జరుగుతోంది. ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలించి గండికోట, చిత్రావతి రిజర్వాయర్లలో 35 టీఎంసీలను నిల్వ చేయగలిగితే, అది అనంతపురం నుండి కుప్పం వరకు వ్యవసాయ రంగానికి ఊతమిస్తుంది. సాగునీరు సకాలంలో అందితే వలసలు తగ్గుముఖం పట్టి, స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడతాయి.
తెలంగాణ ప్రాజెక్టులతో పోలిస్తే, ఏపీ తన చట్టబద్ధమైన వాటాలోనే నీటిని పూర్తిగా తరలించుకోలేకపోతోంది. అలాంటప్పుడు అదనపు నీటిని దోచుకుంటున్నారనే ప్రచారం ఏంటి? ఈ ప్రాజెక్టుకు పెండింగ్‌లో ఉన్న కొద్దిపాటి పనులను పూర్తి చేయడానికి నిధుల కేటాయింపును ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకోవాలి. ఇది కేవలం నీటి తరలింపు పథకమే కాదు, రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన జలవనరులను అందించే ఆర్థిక కారిడార్‌గా కూడా మారుతుంది. నీటి భద్రత ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయి, తద్వారా ప్రాంతీయ అసమానతలు తొలగిపోతాయి.

‘జల దోపిడీ’ నిందలపై సీమ ఆగ్రహం
రాయలసీమ ప్రాంతంపై పడుతున్న ‘జల దోపిడీ’ నిందలు ఇక్కడి ప్రజలను తీవ్రంగా కలచివేస్తున్నాయి. తమకు దక్కాల్సిన 144.7 టీఎంసీల నీటిని కూడా వాడుకోలేక పోతున్న తరుణంలో ఇలాంటి ఆరోపణలు రావడం సామాజిక అవమానంగా భావిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కేవలం ఒక ఇంజనీరింగ్ అద్భుతం కాదు, అది ఇక్కడి రైతాంగం ఆత్మగౌరవ ప్రతీక. సీమ బిడ్డల ప్రాథమిక హక్కులను కాలరాయడం వల్ల భవిష్యత్తులో సామాజిక అశాంతి నెలకొనే ప్రమాదం ఉంది. సిద్ధేశ్వరం అలుగు వంటి డిమాండ్లు కూడా ఇందుకే తెరపైకి వస్తున్నాయి.
నీటి పంపిణీలో జరుగుతున్న అన్యాయంపై సీమలోని మేధావులు, రైతులు ఐక్యంగా గళమెత్తుతున్నారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులను సాకుగా చూపి ఇప్పుడు ప్రాజెక్టును నిలిపివేయడం సరికాదన్నది సామాన్యుల వాదన. నీరు లేక ఎండిపోతున్న పొలాలను, ఖాళీ అవుతున్న గ్రామాలను చూస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఈ సామాజిక వేదనను ప్రభుత్వం గుర్తించాలి. కేవలం పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపితే సరిపోదు, సీమ ప్రయోజనాల విషయంలో కచ్చితమైన స్టాండ్ తీసుకోవాలి. లేనిపక్షంలో సామాజికంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
అనుమతుల సాధన శాశ్వత పరిష్కారం
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కేవలం న్యాయ పోరాటం మరియు పకడ్బందీ వాదనలోనే ఉంది. కృష్ణా నదిలో వరద ప్రవాహం ఉండి, నీరు సముద్రంలో కలిసే సమయంలో ఆ నీటిని తీసుకోవడం ఎవరికీ నష్టం కలిగించదు. ఈ పాయింట్‌ను జాతీయ వేదికలపై ఏపీ ప్రభుత్వం గట్టిగా వినిపించాలి. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అన్ని పక్షాలు ఏకతాటిపైకి వచ్చి రాయలసీమ హక్కుల కోసం పోరాడాలి. శ్రీశైలం భద్రతకు ముప్పు ఉన్నప్పుడు లేదా నిల్వ సామర్థ్యం తగ్గినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చనే నిబంధనలను ఉటంకించాలి.
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గాలేరు-నగరి, హంద్రీ-నీవా మరియు తెలుగుగంగ ప్రాజెక్టులతో సమర్థంగా అనుసంధానం చేయాలి. దీనివల్ల కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని చివరి ఆయకట్టు వరకు నీరు చేరుతుంది. అనుమతుల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు, పనులను పారదర్శకంగా పూర్తి చేయాలి. అది సాధ్యమైనప్పుడే రాయలసీమ ‘రతనాల సీమ’గా మారుతుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితేనే వెనుకబడిన ఈ ప్రాంతపు రైతులకు నిజమైన ఆశాదీపం లభిస్తుంది. సీమ ప్రజల జల ఆకాంక్షను గౌరవించడమే ప్రజాస్వామ్య ప్రభుత్వ లక్ష్యం కావాలి.
#RayalaseemaLiftIrrigation #APWaterRights #SrisailamStorageIssues #RevanthReddyVsChandrababu #RayalaseemaWaterStruggle #JusticeForRayalaseema
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.
Present generation journalist verry.. Verry… rare. Real fact news. Nothing but… But.. Your.. Dynamic and… Political.. Leader… Sir… 🙏💐❤️🌹👌… Tq… Message for you….
Journalist is a public
Journalist is a real fact
Journalist is a communication are society
Chala Baga Explain Chesaru