కేరళలోని శబరిమలకు వెళ్ళాలంటే అనేక కొండలు గుట్టలు దాటుకుని వెళ్ళాలి. ప్రత్యేకించి కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు నుంచి అనేక మంది భక్తులు వ్యయ ప్రయాసలగూర్చి వెళ్ళుతూ ఉంటారు. ప్రయాణ సమయంలో అయ్యప్ప భక్తులు ఇరుముడిని దగ్గరే పెట్టుకోవాలి. అది ఆచారం.
కానీ, విమానాలలో ఇరుముడిని అనుమంతించకపోవడంతో మాలధారణ చేసిన వారు రోడ్డు మార్గాన్నే ఎంచుకునే వారు. కానీ, ఇక ఆ తిప్పలు లేవు. ఇరుముడిని నేరుగా క్యాబిన్ లోకి తీసుకు వెళ్ళవచ్చు. ఇలా విమానయాన శాఖ అనుమతిచ్చింది.
ప్రస్తుత శబరిమల యాత్ర సీజన్‌కు సంబంధించిన మండలం, మకరజ్యోతి దీక్షలు పూర్తయ్యే జనవరి 20వ తేదీ వరకు మాత్రమే ఈ అనుమతి ఉంటుందని అధికారి ఒకరు పేర్కొన్నారు. నెయ్యితో నింపిన టెంకాయ, ఇతర పూజాసామగ్రిని కలిపి ఇరుముడి అంటారు.
దీనిని ఇంతకాలంలో అధకారులు క్యాబిన్ లోకి అనుమతించే వారు కాదు. అయితే, అనేక వినతుల తరువాత ఏవియేషన్ సెక్యూరిటీ గ్రూప్(ఏఎస్‌జీ) అదనపు భద్రతా చర్యలు, చెకింగ్ చేపడతుతుందని బీసీఏఎస్ తెలిపింది.
ప్రత్యేకమైన చెకింగుల తరువాత ఇరుముడితో సహా విమానంలోకి ప్రవేశించవచ్చు. శబరిమలకు అయ్యప్ప భక్తుల తాకిడి పెరిగింది. దీంతో ఆలయ అధికారులు దర్శన సమయాల్లో మార్పులు చేశారు. రెండో విడత దర్శన సమయాన్ని మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటలకు మార్చారు.
అంతకుముందు తెల్లవారుజామున 3 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు భక్తులను అయ్యప్ప దర్శనానికి అనుమతించేవారు.
శబరిమల యాత్ర నిమిత్తం అయ్యప్ప ఆలయాన్ని ఈనెల 16న తెరిచారు. సోమవారం నాటికి 3 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకొన్నారు. ఈ సంఖ్య రాబోరోజుల్లో పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది.