-
రాయచోటికి చంద్రబాబు అన్యాయం: శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు తరలించడంపై వైఎస్సార్సీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
వైఎస్ జగన్ హయాంలో నిపుణుల కమిటీ నిర్ణయం మేరకే భౌగోళిక అంశాలను పరిగణనలోకి తీసుకుని రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. అయితే, కూటమి ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతోనే జిల్లా కేంద్రాన్ని తరలించి రాయచోటి ప్రజలకు అన్యాయం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాయచోటిలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ప్రజల అభిప్రాయాలను సేకరించకుండానే ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడం దారుణమని మండిపడ్డారు.
ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా చివరి కోరిక అడిగే అవకాశం ఉంటుందని, కానీ రాయచోటి ప్రజలకు కనీసం వారి అభ్యంతరాలు చెప్పుకోవడానికి ఒక్క రోజు కూడా గడువు ఇవ్వలేదని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఇక్కడి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రం సాధన కోసం అవసరమైతే న్యాయపోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాయచోటి అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
మంత్రికి సవాల్: రాజీనామా చేస్తే పోటీ నుంచి తప్పుకుంటా
జిల్లా కేంద్రం తరలిపోతుంటే స్థానిక మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఏం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాంతంపై మంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ జిల్లా కేంద్రం కోసం మంత్రి రాజీనామా చేసి వస్తే, వచ్చే ఎన్నికల్లో తాను ఆయనపై పోటీ కూడా చేయనని సంచలన సవాల్ విసిరారు. క్యాబినెట్‌లో ఉండి కూడా జిల్లా కార్యాలయాలను అడ్డుకోలేకపోవడం మంత్రి అసమర్థతకు నిదర్శమని ఆయన విమర్శించారు.
మరోవైపు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు తన నైజం ప్రకారం ప్రజలను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. సజావుగా సాగుతున్న పరిపాలనను అస్తవ్యస్తం చేస్తూ జిల్లాను మూడు ముక్కలు చేశారని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న వ్యక్తి, కొత్తగా మరో కాలేజీ ఇస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. జిల్లా కేంద్రం తరలిపోవడంతో నష్టపోయిన వ్యాపారులు, సామాన్య ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
#Rayachoti #AnnamayyaDistrict #YSRCP #APPolitics #JusticeForRayachoti