వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు సాగే వైకుంఠ ద్వార దర్శనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైన పర్వదినం. ముక్కోటి ఏకాదశి నాడే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, ఈ సమయంలో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సోమవారం అర్ధరాత్రి 12:05 గంటలకు అర్చక స్వాములు ఆగమ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి వైకుంఠ ద్వారాలను తెరిచారు. తొలుత ప్రముఖులు దర్శించుకున్న అనంతరం, తెల్లవారుజామున 5:30 గంటల నుండి సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
తిరుమల క్షేత్ర చరిత్ర ప్రకారం, విష్ణుమూర్తిని దర్శించేందుకు ముక్కోటి దేవతలు ఈ పవిత్ర తిథినాడు వైకుంఠానికి చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని ‘ముక్కోటి ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు పది రోజుల పాటు ఈ దివ్య దర్శనం కొనసాగనుంది. గోవింద నామస్మరణతో సప్తగిరులు పులకించిపోతుండగా, భక్తులు భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు.
వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న ప్రముఖులు
వైకుంఠ ద్వార దర్శనం మొదలవగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు దర్శనం చేసుకున్నారు. అలాగే సినీనటుడు నారా రోహిత్ దంపతులు, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్, సినీ నిర్మాత డివివి దానయ్య, మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, కూతుళ్లు సుస్మిత, శ్రీజ, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసులు రెడ్డి, తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, రాష్ట్ర శాసన సభాపతులు అయ్యన్నపాత్రుడు, రఘురామ కృష్ణంరాజు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంత్రులు అచ్చం నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, సవిత, నిమ్మల రామానాయుడు, నటుడు శివాజీ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులు, మాజీ మంత్రులు రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, టీం ఇండియా క్రికెటర్ తిలక్ వర్మ, భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా, మేనేజింగ్ డైరెక్టర్ సుచరిత ఎల్లా తదితరులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.
భక్తుల రద్దీ మరియు టీటీడీ ఏర్పాట్లు
వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొదటి మూడు రోజుల పాటు (డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనం టోకెన్లను ఈ-డిప్ (లాటరీ) విధానం ద్వారా కేటాయించారు. జనవరి 2 నుండి 8వ తేదీ వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా భక్తులకు దర్శనం కల్పించనున్నారు. టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే నిర్ణీత సమయంలో దర్శనానికి అనుమతిస్తున్నారు.
ఈ పది రోజుల పాటు శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్‌లైన్ టికెట్లు, సిఫార్సు లేఖలు, పలు ఆర్జిత సేవలు మరియు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లలో అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు నిరంతరం అందిస్తున్నారు. తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా దర్శన టోకెన్ల జారీ ప్రక్రియపై టీటీడీ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. శ్రీవారి దివ్య దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో తిరుమల వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి.
#Tirumala #VaikuntaEkadashi #TTD #SrivariDarshan #Devotional