కిలిమంజారోపై కూలిన హెలికాప్టర్.. ఐదుగురు మృతి
టాంజానియాలోని (Mount Kilimanjaro) కిలిమంజారో పర్వతంపై హెలికాప్టర్ కూలి ఐదుగురు మృతి చెందినట్లు (Tanzania Civil Aviation Authority) పౌర విమానయానశాఖ గురువారం వెల్లడించింది. ఈ ప్రమాదం బుధవారం కిలిమంజారోపై ఉన్న బరాఫు క్యాంప్ సమీపంలో చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఒక గైడ్, ఒక వైద్యుడు, పైలెట్‌తో పాటు మరో ఇద్దరు విదేశీ పర్యాటకులు మరణించినట్లు కిలిమంజారో ప్రాంత పోలీస్ అధికారి సైమన్ మైగ్వా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ (Medical Evacuation Helicopter) వైద్య సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలిపారు.
ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వతమైన కిలిమంజారో సముద్ర మట్టానికి సుమారు 6,000 మీటర్ల ఎత్తులో ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం సుమారు 4,670 నుంచి 4,700 మీటర్ల ఎత్తు మధ్య జరిగినట్లు వెల్లడించారు.
ప్రతి ఏడాది సుమారు 50,000 మంది పర్యాటకులు కిలిమంజారో పర్వతాన్ని అధిరోహిస్తుంటారని, ఈ ఘటన పర్యాటక రంగంలో కలకలం రేపిందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
#Kilimanjaro
#HelicopterCrash
#Tanzania
#AviationAccident
#TouristSafety
#BreakingNews