మహిళల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మారింది. శివాజీ క్షమాపణలు చెప్పినా, పశ్చాతాపపడ్డా చాలా మంది ఆయననపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ మాత్రం ఆయనపై విరుచుకుపడుతూ సోషల్ మీడియాలో సంచలన వీడియో విడుదల చేశారు.
నటుడు శివాజీ ఇటీవల మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెను దుమారం రేపుతున్నాయి. దీనిపై ఇప్పటికే పలువురు విమర్శలు చేయగా, తాజాగా నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) మరింత తీవ్రంగా స్పందించారు. శివాజీ తీరును తప్పుబడుతూ, ఆయన ఒక “నార్సిసిస్ట్” (Narcissist) అని, తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు సింపతీ కోసం ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. మహిళలకు తమ హక్కులు తెలుసని, ఎవరూ తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
సింపతీ డ్రామాలు వద్దు
శివాజీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు కోరడాన్ని కూడా అనసూయ విమర్శించారు. తప్పు చేసి మళ్లీ బాధితుడిగా (Victim) నటించడం నార్సిసిస్ట్ లక్షణమని ఆమె ఎద్దేవా చేశారు. “మీకు నిజంగా మహిళల పట్ల గౌరవం ఉంటే, వారికి నీతులు చెప్పడం ఆపి.. మగవారికి బుద్ధి చెప్పండి. అడవి జంతువుల్లా మీద పడకుండా, ఎదుటివారి గౌరవాన్ని కాపాడమని మగవారికి నేర్పించండి” అని ఆమె ఘాటుగా సూచించారు. తన వ్యక్తిగత కంట్రోల్ లేనివారే ఇతరులపై అదుపు సాధించాలని చూస్తారని ఆమె అభిప్రాయపడ్డారు.
హక్కుల విషయంలో రాజీ పడేదేలేదు
దుస్తుల విషయంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, ఏ సందర్భంలో ఎలా ఉండాలో తమకు తెలుసని అనసూయ పేర్కొన్నారు. “మేము చిన్న పిల్లలం కాదు.. మా ఇష్టాలు, మా హక్కులు మాకు తెలుసు. మమ్మల్ని మా ఇష్టప్రకారం బతకనివ్వండి” అని ఆమె కోరారు. శివాజీ తన మాటలతో మహిళా నటీమణులను కించపరిచారని, అలాంటి ధోరణి సమాజానికి మంచిది కాదని హితవు పలికారు. ఫెమినిజం అంటే స్త్రీ, పురుషులు సమానమని నమ్మడమేనని అన్నారు.
అసలు స్వరూపం బయటపడింది
బయట ప్లాట్‌ఫారమ్‌లపై మాట్లాడేటప్పుడు కనిపించే స్వరూపం వేరని, కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే అసలు వ్యక్తిత్వం బయటపడుతుందని అనసూయ వ్యాఖ్యానించారు. శివాజీ వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని, దాన్ని కేవలం కన్సర్న్ (Concern) అని చెప్పి సరిపెట్టలేమని ఆమె అన్నారు. తనతో పాటు చాలా మంది హీరోయిన్లు తన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారని, ఈ పోరాటం కేవలం తన కోసమే కాదని మహిళలందరి గౌరవం కోసమని ఆమె స్పష్టం చేశారు.
సామాజిక మధ్యమాల్లో మద్దతు
అనసూయ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ మద్దతు తెలుపుతున్నారు. సినిమా రంగంలో ఉన్న మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సమాజంపై తప్పుడు ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివాజీ క్షమాపణ చెప్పినప్పటికీ, ఈ వివాదం అంత త్వరగా సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ పరిణామం టాలీవుడ్ (Tollywood) వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
#AnasuyaBharadwaj #ActorShivaji #Narcissist #WomenRights #TollywoodNews #Controversy