తండ్రి అంటే రక్షణ,.. తండ్రి అంటే భరోసా….తండ్రి అంటే నమ్మకం….కానీ ఇక్కడ అదే తండ్రి తన కూతుళ్ల పాలిట యమకింకరుడయ్యాడు. నాన్నా… నాన్నా… నన్ను చంపొద్దు… నన్ను వదిలేయ్.. నీకు భారంకాను. అంటున్నా వినలేదు. ఇద్డరు కూతుళ్ళను వెంటాడి వెంటాడి నీటిలో తోసి చంపేశాడు.
అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వ్యక్తి, అదే అనుమానాన్ని తన చిన్నారులపైకి మళ్లించాడు. కుటుంబ గౌరవం పేరిట పెంచుకున్న అనుమానాలు చివరకు అమాయక ప్రాణాలను బలిగొన్నాయి.
బొమ్మనహాళ్ మండలం నేమకల్లుకు చెందిన కల్లప్ప. వారికి సింధు, అనూష కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కూతుర్లు ఇద్దరూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతు న్నారు.ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో ఆలయానికి తీసుకెళ్తున్నానని మాయమాటలు చెప్పాడు. అంతకంటే ఇంకేముందని ఆ అమ్మాయిలు ఆనందంతో కేరింతలు వేశారు. ఇద్దరు కూతుళ్లు కన్న తండ్రి చేయి పట్టుకొని వెంట నడిచారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి కాలయముడవుతాడని అభం శుభం తెలియని చిన్నారులకు తెలియదు.
నమ్మించి కాలువ వద్దకు తీసుకెళ్ళాడు మొదట పెద్ద కుమార్తె సింధును కాలువలో తోసేశాడు. చెల్లలు అనూష అప్రమత్తమై తండ్రి చేయివిడిపించుకుని పరుగులు తీసింది. అయినా ఆ కసాయి తండ్రి కనికరించలేదు. వెంటపడ్డాడు. వెంబడించాడు. చివరకు చిన్న కుమార్తెను దొరకబుచ్చుకున్నాడు. ఆ అమ్మాయి కాళ్ళా వేళ్ళా పడుతున్నా కనికరించలేదు. ఈడ్చుకొచ్చి అక్కడ తోసేసిన కాలువలోనే అనూషను కూడా తోసేసి ఎక్కడ బయటకు వస్తారోనని అక్కడే వారు మునిగిపోయే వరకూ కాపలా కాశాడు. ఇక బతికే అవకాశం లేదనుకున్న తరువాత తాపీగా ఇంటికి చేరుకున్నాడు.
ఏమి తెలియనట్లు ఉండిపోయాడు. ఎంతకూ పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లి మనస్సు తల్లడిల్లిపోయింది. భర్త ప్రవర్తనలో తేడా రావడంతో ఇరుగుపొరుగువారితో కలసి నిలదీసింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కల్లప్పను విచారించడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#CrimeNews #FamilyTragedy #MentalHealthAwareness #ChildSafety #AndhraPradesh