- వైఎస్ బతికి ఉన్నంత వరకు ఏ ఆస్తి పంపకం జరగలేదు.
- అమ్మను కూడా అనేక రీతిల్లో అవమానించాడు.
- దివంగత వైఎస్ అభిమానులకు షర్మిల బహిరంగ లేఖ
తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నంత వరకూ ఏ ఆస్తిలోనూ పంపకం జరగలేదని, జగన్మోహన్ రెడ్డి చెబుతున్నవన్నీ అబద్దాలేనని, తనకు న్యాయంగా రావాల్సిన వాటాలో తనకు ఏ మాత్రం అందలేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. “ప్రేమతో రూ 200 కోట్లు ఇచ్చాను, నీకు కృతజ్ఞత లేదు – షర్మిలకు జగన్ లేఖపై ఆమె స్పందించారు.
దీంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు ఆమె బహిరంగ లేఖ రాశారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఓ పుస్తకం రాశారని, అందులో తండ్రి గురించి ప్రత్యేకంగా ఒక మాట రాశారని షర్మిల తెలిపారు. రాజశేఖర్ రెడ్డి గారికి లోకం అంతా ఒకెత్తయితే తన బిడ్డ షర్మిల ఒకెత్తు అని రాశారని గుర్తుచేశారు. నాన్నకు తనంటే ప్రాణమని, నాన్న తనను ఎప్పుడూ ఆడపిల్ల కదా అని చిన్న చేసో, తక్కువ చేసో చూడలేదన్నారు. తను బ్రతికి ఉన్నన్ని రోజులు నలుగురు మనవళ్లు, మనవరాళ్ల తనకు సమానం అనే వారన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్థాపించిన అన్ని సంస్థలు, వ్యాపారాల్లో సమాన వాటా కూడా ఉండాలనే వారన్నారు. అవి జగన్ మోహన్ రెడ్డి సొంతం కాదన్నారు. ఆయన సంరక్షుడు మాత్రమేనని కూడా తెలిపారు. కేవీపీ, వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, భారతిలకు రాజశేఖర్ రెడ్డి అభిప్రాయం స్పష్టంగా తెలుసన్నారు.
వైఎస్ ఆస్తులు పంచలేదు-జగన్ ఆస్తులు అక్కర్లేదు
ఈ రోజు వరకు తనకు న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా తన చేతుల్లో లేదన్నారు. స్వార్జితం అని జగన్ చెప్పుకుంటున్న ఆస్తులు అన్ని కుటుంబ ఆస్తులే అన్నారు. రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నప్పుడే ఆస్తులు పంపిణీ చేశారనేది అవాస్తవం అన్నారు. తాను జగన్ ఆస్తుల్లో వాటా అడుగుతున్నాను అనేది హాస్యాస్పదం అన్నారు.
ఆస్తులపై తనకు మోజు లేదని, వీళ్ళు పెట్టిన హింసలకు ఈ ఆస్తులు కావాలని కోరిక కూడా లేదని షర్మిల తెలిపారు. కేవలం తన బిడ్డలకు ఈ ఆస్తులు చెందాలి అనేది రాజశేఖర్ రెడ్డి అభిమతం గనుక, ఈ రోజు వరకు కూడా అమ్మైనా, తానైనా తపన పడుతున్నామన్నారు.
బిడ్డల్ని కూడా పక్కన పెట్టి పార్టీకి పని చేశా
తన తండ్రి వైఎస్ మరణం తర్వాత జగన్ 10 ఏళ్లు ఇబ్బందులు పడితే, ఆయన ఇబ్బందులు తన ఇబ్బందులు అనుకొని సాయం చేశానని చెప్పారు. తోడబుట్టిన వాడికోసం నా బిడ్డలను సైతం పక్కనపెట్టి ఆయన్ను, ఆయన పార్టీని ఏ స్వార్ధం లేకుండా భుజాల మీద మోశానన్నారు. ఆ 10 ఏళ్లు తన అవసరం ఉంది అనుకున్నారో, ఏమో బాగానే చూశారన్నారు. పెద్ద కూతురు అన్నారని, ఆ 10 ఏళ్లు వైఎస్సారర్ ఊహించినట్లే .. గ్రాండ్ చిల్డ్రన్ నలుగురు సమానం అన్నట్లుగానే వ్యవహరించారన్నారు.
రూ.200 కోట్లు లాభాలే
తనకు 200 కోట్లు ఇచ్చామని చెప్తున్నది ఆస్తులు కాదని, అందులో వచ్చిన లాభాలు మాత్రమేనని ఆమె చెప్పారు. వాళ్ళు చేసింది ఉపకారం కాదన్నారు. ప్రేమతో ఇచ్చింది అంతకంటే కాదని, తనకు సమాన వాటా ఉంది కాబట్టి డివిడెండ్ లో సగం వాటా ఇవ్వడం జరిగిందన్నారు. కంపెనీల్లోని డివిడెండ్‌లో సగం వాటా తనకు ఇవ్వడమే ఈ 200 కోట్లు అన్నారు. అది కూడా అప్పుగా చూపించమన్నారన్నారు.
తన ‘సోదరుడు జగన్’ అధికారం వచ్చాక 2019లో జగన్ సీఎం అయ్యారని, ఆ తర్వతా గుర్తుపట్టలేనంతగా మారిపోయారని షర్మిల తెలిపారు. ఇజ్రాయిల్ పర్యటనలో విడిపోయే ప్రతిపాదన పెట్టారని, అందుకు అమ్మా, తాను వద్దు అని చెప్పామన్నారు. అయినా విడిపోవాల్సిందేనని జగన్ పట్టుబట్టాడన్నారు. తర్వాత రోజుల్లో ఆస్తులు పంచుకుందామని విజయవాడకు రమ్మన్నారని, విజయవాడకు వచ్చాక, భారతి సిమెంట్స్, సాక్షిలో తను 60 శాతం వాటా తీసుకుంటానని, మిగిలిన 40 ఇస్తానని చెప్పాడన్నారు.
ఆస్తుల్లో ఎక్కడ తేడా కొట్టిందంటే ?
సగం కంటే ఎక్కువ కావాలని గట్టిగా అనుకుంటే 5 శాతం ఎక్కువ తీసుకో లేదా 10 శాతం ఎక్కువ తీసుకో కానీ 20 శాతం ఎక్కువ కావాలని అడగడమంటే అన్యాయం అనిపిస్తుంది అని అమ్మ చెప్పిందని షర్మిల గుర్తుచేశారు. అయినా ఇంతే అని బుల్డోజ్ చేశారని, తర్వాత అర్ధగంటలో ఈ ఆస్తులు నీకు, ఈ ఆస్తులు నాకు అని తేలిపోయిందన్నారు. దీని ప్రకారం సాక్షిలో 40 శాతం, భారతి సిమెంట్స్ లో వాళ్లకు చెందిన 49 శాతంలో 40 శాతం, సరస్వతి పవర్ లో 100 శాతం, యలహంక ప్రాపర్టీలో 100 శాతం, వైఎస్ఆర్ నివసించిన ఇల్లు, ఇంకా కొన్ని ఆస్తులు తన భాగానికి వచ్చిందని షర్మిల తెలిపారు.
ఎంవోయూపై అందుకే సంతకం పెట్టానని చెప్పారు. ఆ కొద్ది వారాల్లోనే ఎంఓయు తయారయ్యిందని, అంతకు ముందు మాట్లాడుకున్న దాని ప్రకారం సరస్వతి సిమెంట్స్ షేర్స్, యలహంక ప్రాపర్టీ అటాచ్ కాలేదు కాబట్టి అది వెంటనే రాసిస్తామని, మిగతా ఆస్తులు కేసుల వ్యవహారం పూర్తి అయిన తర్వాత బదిలీ చేస్తామని, ఒప్పందం జరిగి సంతకాలు పెట్టినట్లు షర్మిల తెలిపారు.
ఈ రోజు వరకు ఆస్తులు ఇవ్వాలన్న ఉద్దేశ్యం వాళ్లకు లేదని తెలిపారు. అమ్మ ఒత్తిడి మేరకు, క్లాసిక్, సండూరు హోల్డ్ చేస్తున్న 52 శాతం సరస్వతి షేర్స్ నీ 2021 లో కొనుక్కోవడానికి అంగీకరించారని, ఇక తర్వాత రోజుల్లో వాళ్ళ వ్యక్తిగత షేర్లు కూడా అమ్మకు గిఫ్ట్ ఇచ్చారన్నారు. అదే 2021లో తాను రాజకీయాల్లో అడుగుపెట్టడం, మొదట తెలంగాణలో, ఆ తర్వాత కాలంలో ఆంధ్రకు రావడం జరిగిందన్నారు. తనకు ఇష్టం లేకుండా రాజకీయాల్లోకి వచ్చానని, తనను తొక్కడానికి జగన్ చెయ్యని ప్రయత్నం లేదన్నారు.
కాంగ్రెస్‌లో చేరగానే తిట్టడం మొదలుపెట్టేశారన్నారు. ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేస్తే, నన్ను అన్ని రకాలుగా అవమానించడమే కాకుండా, సోషల్ మీడియాలో ఉచ్ఛం, నీచం లేకుండా, పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న దాన్ని అనే ఇంగితం కూడా లేకుండా, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్నారు.
ఆంధ్ర ఎన్నికల్లో జగన్ ఓడిపోయాక.. ఆ ఓటమికి తానే కారణం అని వాళ్ళు బలంగా నమ్మారని, కాబట్టి తమకు విరోధం వద్దని, సెటిల్ చేసుకుందామని, బంధువులను తన దగ్గరకు పంపించారని తెలిపారు. ఓడిపోయాక సెటిల్మెంట్ కు మనుషుల్ని పంపారు మాకు విరోధం వద్దు అంటూనే సెటిల్మెంట్ చేసుకోవడానికి కండీషన్ పెట్టారని షర్మిల తెలిపారు.
తాను జగన్ మీద, భారతి రెడ్డి మీద, అవినాష్ రెడ్డి మీద పబ్లిక్ ఫ్లాట్ ఫాంలో మాట్లాడకూడదనేది ఆ కండిషన్ సారాంశం అన్నారు. ఆ కండిషన్ తన వృత్తి ధర్మానికి వ్యతిరేకం కాబట్టి తనకు సమ్మతం అనిపించలేదన్నారు. బంధువులు ఎంత ఒత్తిడి చేసినా తాను ఒప్పుకోలేదన్నారు. తాను ఒప్పుకోలేదు కాబట్టే సెటిల్ మెంట్ జరగలేదన్నారు.
అమ్మ మీద ఎన్సీఎల్టీలో మోసం చేసి షేర్లు తీసుకున్నామని కేసు వేశారని, పబ్లిక్‌లో గత కొన్ని రోజులుగా అమ్మ మీద కేసు వేసిన దుర్మార్గుడు అనే అపకీర్తి ఇప్పుడు వస్తుందని గమనించి.. తన బెయిల్ రద్దుకు కుట్ర చేస్తున్నారనే అభియోగం మోపుతున్నారన్నారు. నిజానికి బెయిల్ రద్దు అయ్యే సీన్ లేదు.
ఎందుకంటే సరస్వతి షేర్స్ అటాచ్ అవ్వలేదు. కంపెనీల్లో ఈడీ అటాచ్ చేసింది షేర్లు కాదు. 32 కోట్లు విలువ జేసే భూములు మాత్రమే. షేర్స్ ట్రాన్స్ఫర్ కి, ఆయన బెయిల్ రద్దు కి ఎటువంటి సంబంధం లేదు. వైఎస్ పరువు తీయకూడదనే మౌనంగా ఉన్నాం ఎన్సీఎల్టీలో జగన్ కేసు అమ్మ మీద కాబట్టి, ఈ విషయం బయటకు వస్తే, వైఎస్సార్ కుటుంబం అప్రతిష్టపాలయితే, యావత్ ప్రపంచం నాలుగు రకాలుగా మాట్లాడితే, అమ్మ ఎంతగానో క్షోభపడుతుందని, ఇది తమలో తామే విషాన్ని గొంతులో దాచుకున్నట్టు దాచుకున్నామని షర్మిల తెలిపారు. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన ఎంఒయు జగన్ వల్లనే బయటకు వచ్చింది.
చంద్రబాబు చేతిలో బాణం కావాల్సిన అవసరం వైఎస్సార్ బిడ్డకు లేదన్నారు. జగన్ ఎవరి కొంగు చాటున ఉండి, ఆస్తి, అధికారం కోసం ఇదంతా చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు. అభిమానుల కోసమే వాస్తవాలు చెప్తున్నా అమ్మ, తాను మోసం చేస్తున్నామని గాని, లేక ఆస్తికోసం అత్యాశ పడుతున్నామని గాని, వైఎస్సార్ అభిమానులు భావించకూడదని.. వాస్తవాలు అన్ని మీ ముందు పెడుతున్నట్లు షర్మిల తెలిపారు.