బర్త్ డే వేడుకలా? వికృత చేష్టలా?
ఒంగోలు: రాజకీయాల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సహజం. కానీ, ఆ వేడుకలు కాస్తా ‘రక్తాభిషేకాలు’, ‘వ్యూహం’ మార్చిన నినాదాలతో హింసాత్మకంగా మారడంపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా ధ్వజమెత్తారు.
సోమవారం ఆమె ఒంగోలు పర్యటనలో భాగంగా పోలీసు శిక్షణ కళాశాల (PTC) లో మహిళా కానిస్టేబుళ్ల శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ బర్త్ డే వేడుకల్లో జరిగిన ఘటనలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“రప్పా.. రప్పా” ఏంటి ఆ పైశాచికత్వం?
వైసీపీ కార్యకర్తలు ఊరూరా ఏర్పాటు చేసిన “రప్పా.. రప్పా” ప్లెక్సీలపై అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “చదువుకునే చేతులకు పుస్తకాలు ఇవ్వాల్సింది పోయి, ఇలాంటి హింసాత్మక నినాదాలు, ప్లెక్సీలు పట్టిస్తారా?” అని మండిపడ్డారు. చిన్న పిల్లలతో ఇలాంటి రాజకీయాలు చేయించడం బాధ్యతారహితమైన ప్రతిపక్ష లక్షణమని ఆమె విమర్శించారు.
మేకల తలలు నరికి.. రక్తాభిషేకాలేంటి?
కొన్ని ప్రాంతాల్లో జగన్ చిత్రపటాలకు, ప్లెక్సీలకు మేకల తలలు నరికి వాటి రక్తంతో అభిషేకాలు చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇవి వేడుకలా లేక నేర ప్రవృత్తిని పెంచే కార్యక్రమాలా?” అని ప్రశ్నించారు. ఇలాంటి వికృత చేష్టలు సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తాయని, రౌడీయిజాన్ని ప్రోత్సహించే ఇలాంటి చర్యలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని హెచ్చరించారు.
గంజాయి రహిత ఏపీయే మా అంతిమ లక్ష్యం!
గత ప్రభుత్వ హయాంలో గంజాయి సాగు, రవాణా ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసని, ఇప్పుడు దాన్ని తాము సున్నాకు తీసుకొచ్చామని అనిత పేర్కొన్నారు. “మేము గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తున్నాం. ఎవరైనా సరే రవాణా చేసినా, విక్రయించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు.
ఓటమి భయం.. అందుకే ఈ హడావుడి!
ప్రజలు ఇప్పటికే వైసీపీకి గట్టి బుద్ధి చెప్పారని, అయినా వారిలో మార్పు రాలేదని అనిత విమర్శించారు. జగన్ చేస్తున్న వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, రాబోయే రోజుల్లో రౌడీయిజం చేస్తే ఇనుప పాదంతో తొక్కుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.