భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బుధవారం పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్ పెరగడం, రూపాయి మారకపు విలువలో ఒడిదుడుకులు ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజులోనే రూ.1,100 పెరిగి రూ.1,35,280కు చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,000 పెరిగి రూ.1,24,000గా నమోదైంది.
వెండి ధర కూడా ఆకాశాన్ని తాకుతోంది. కేజీ వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,31,000కు చేరింది. కేవలం మూడు రోజుల్లోనే వెండి ధర రూ.10,000 పెరగడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా దాదాపు ఇదే స్థాయి ధరలు కొనసాగుతున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్‌లో ధరల పెరుగుదలతో సామాన్య వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.