మరో కొత్త మార్పు.. పన్ను ఎగవేతకు కళ్లెం వేసే దిశగా కేంద్రం అడుగులు
పన్ను ఎగవేతకు కళ్లెం వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయనుంది. డిజిటల్ యుగానికి అనుగుణంగా ఆదాయపు పన్ను చట్టంలో చారిత్రాత్మక మార్పులకు తెరలేపుతూ, పన్ను చెల్లింపుదారుల ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిఘా పెంచేందుకు సిద్ధమైంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆదాయపు పన్ను బిల్లు–2025 దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ బిల్లు అమలులోకి వస్తే, 2026 ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను శాఖకు పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా ఖాతాలు, ఈమెయిల్స్, ఇతర డిజిటల్ ఖాతాలను పరిశీలించే అధికారం లభించనుంది. పన్ను ఎగవేతను అరికట్టడం, ఆర్థిక పారదర్శకతను పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘వర్చువల్ డిజిటల్ స్పేస్’ నిర్వచనాన్ని విస్తరించింది. దీని పరిధిలో సోషల్ మీడియా వేదికలు, ఈమెయిల్ కమ్యూనికేషన్, క్లౌడ్ స్టోరేజ్, ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఖాతాలు ఉంటాయి. ప్రకటించిన ఆదాయానికి, జీవనశైలికి మధ్య వ్యత్యాసాలను గుర్తించేందుకు ఏఐ ఆధారంగా డేటా విశ్లేషణ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే గోప్యత హక్కుపై ప్రభావం పడుతుందంటూ న్యాయ నిపుణులు, పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కోర్టు అనుమతి లేకుండా వ్యక్తిగత సమాచార సేకరణ దుర్వినియోగానికి దారి తీయవచ్చని విమర్శలు వినిపిస్తున్నాయి.