ఆరంభం అదుర్స్.. టీమిండియా ఘన విజయం
– తొలి టీ20లో లంకపై టీమిండియా ఘన విజయం
– ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్
విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. జెమీమా రోడ్రిగ్స్ అద్భుత అర్ధసెంచరీతో చెలరేగడంతో టీమిండియా ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1–0 ఆధిక్యం సంపాదించింది. ఆరంభ మ్యాచ్‌లోనే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ అభిమానులను ఉత్సాహపరిచింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనకు శ్రీలంక బ్యాటర్లు తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి లంక 121 పరుగులకే పరిమితమైంది. విష్మి గుణరత్నే 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. చమరి అతపత్తు (15), హాసిని పెరీరా (20), హర్షిత సమరవిక్రమ (21) పర్వాలేదనిపించినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి ఒక్కో వికెట్ తీసి ప్రత్యర్థి పరుగుల్ని కట్టడి చేశారు.
122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన (25), షఫాలీ వర్మ (9) మంచి ఆరంభాన్ని అందించారు. అయితే వారు ఔటైన తర్వాత ఇన్నింగ్స్‌ను జెమీమా రోడ్రిగ్స్ తన భుజాలపై మోసుకుంది. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఆమె 44 బంతుల్లో 10 ఫోర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (15 నాటౌట్) ఆమెకు చక్కటి సహకారం అందించడంతో, భారత్ 14.4 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది.
ఈ అద్భుత ప్రదర్శనకు జెమీమా రోడ్రిగ్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. తొలి మ్యాచ్‌లోనే ఘన విజయం సాధించిన భారత్ సిరీస్‌పై పట్టు సాధించాలనే ధీమాతో ముందుకు సాగుతోంది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ డిసెంబరు 23న ఇదే విశాఖపట్నం స్టేడియంలో జరగనుంది.