తిరుమల కొండలకు మరో మణిహారం
– శేషాచలం అడవులకు జీవనాడిగా దివ్య ఔషధ వనం
– రూ.4.25 కోట్లతో 3.90 ఎకరాల్లో ఏర్పాటుకు టీటీడీ ఆమోదం
తిరుమల కొండలకు మరో విశిష్ట ఆకర్షణగా ‘దివ్య ఔషధ వనం’ రూపుదిద్దుకోనుంది. భారతీయ సంప్రదాయ వైద్య విధానాలకు ఆధారమైన ఔషధ మొక్కలను సంరక్షించడమే లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ వినూత్న ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. రూ.4.25 కోట్ల వ్యయంతో 3.90 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ ఔషధ వనం, అంతరించిపోతున్న అరుదైన మొక్కలకు జీవనాడిగా మారనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శేషాచలం అడవుల్లో ఉన్న జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ, ప్రజలకు ఔషధ మొక్కల ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
ఈ దివ్య ఔషధ వనంలో భక్తి, విజ్ఞానం, ప్రకృతి సమ్మేళనం స్పష్టంగా కనిపించనుంది. దేహ చికిత్స వనం, సుగంధ వనం, పవిత్ర వనం, ప్రసాద వనం, పూజా ద్రవ్య వనం, కల్పవృక్ష ధామం, ఋతు వనం వంటి 13 ప్రత్యేక థీమ్ విభాగాలను ఏర్పాటు చేసి, ప్రతి మొక్కకు ఉన్న ఔషధ, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని వివరించే విధంగా అభివృద్ధి చేయనున్నారు. దీంతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు, విద్యార్థులు, పరిశోధకులు, ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక అధ్యయన కేంద్రంగా కూడా ఉపయోగపడనుంది.
తిరుమలలోని జీఎన్సీ టోల్ గేట్ సమీపంలో, దిగువ–ఎగువ ఘాట్ రోడ్ల మధ్య ఉన్న స్థలంలో ఈ వనాన్ని అభివృద్ధి చేయనున్నారు. వచ్చే నెలలో పనులు ప్రారంభించి, మొక్కల పెంపకం, సందర్శకుల కోసం పార్కింగ్, మౌలిక వసతులు ఏర్పాటు చేసి, వచ్చే ఏడాది చివరి నాటికి భక్తుల సందర్శనకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ లక్ష్యంగా పెట్టుకుంది. దివ్య ఔషధ వనం పూర్తి అయితే, తిరుమల కొండల సహజ సౌందర్యానికి మరింత మణిహారంలా నిలిచి, పర్యావరణ పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలవనుంది.