న్యూఢిల్లీ, జూన్ 17: అణ్వాస్త్రాలలో ఎవరు మేటి? ఎవరి వద్ద ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి? అనే అంశాలపై స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) అనే సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. భారత్ వద్ద ప్రస్తుతం పాకిస్తాన్ కంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి. అందులో అనుమానం లేదు, కానీ, చైనా వద్ద భారత్ కంటే మూడు రెట్లు ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయని నివేదికలో చెప్పింది. భారతదేశం తన అణ్వాయుధాలను పెంచుకునే తీరును కూడా తెలియజెప్పింది. 2025 SIPRI ఇయర్‌బుక్ ప్రకారం, 2025 జనవరి నాటికి భారత్ వద్ద 180 అణు యుద్ధశస్త్రాలు ఉండగా, పాకిస్తాన్ వద్ద 170 ఉన్నాయి. ఇదే సమయంలో చైనాలో 600 అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిలో 24 నిక్షిప్త స్థితిలో ఉన్నాయని SIPRI వెల్లడించింది.
మారుతున్న అణ్వాయుధ దృక్కోణం
భారత్ తన అణు ఆయుధాలను క్రమంగా విస్తరిస్తున్నదని, కొత్త రకమైన అణు రవాణా వ్యవస్థలు (nuclear delivery systems) అభివృద్ధి చేస్తోందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ‘క్యానిస్టరైజ్డ్’ క్షిపణులు — అంటే యుద్ధశస్త్రాలతో పాటు తరలించగలిగే రాకెట్లు — త్వరలోనే అమలులోకి రానున్నాయని తెలిపింది. ఇవి బహుళ యుద్ధశస్త్రాలు (multiple warheads) మోయగల సామర్థ్యం కలిగి ఉండొచ్చని నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో పాకిస్తాన్ కూడా కొత్త రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేస్తోందనీ, రానున్న దశాబ్దంలో దాని అణు సామర్థ్యం పెరిగే అవకాశముందని SIPRI విశ్లేషించింది.
SIPRI నివేదిక ప్రకారం, భారత్ తన అణు ప్రతిఘటన విధానం పాకిస్తాన్ కంటే చైనాపై దృష్టి కేంద్రీకరిస్తోంది. దీని కోసం భారత్ దూర ప్రయాణ క్షిపణులను అభివృద్ధి చేస్తోంది. భారత్ అణు ఆయుధాలు ప్రస్తుతం విమానాలు (aircraft), ఖండాంతర క్షిపణులు, సముద్రపు అణు నౌకల (SSBNs) ద్వారా నిర్వహించే త్రిభుజ వ్యూహంలో (nuclear triad) భాగంగా ఉన్నాయి.
ఆపరేషన్ సిందూర్– అణు ముప్పుపై సంకేతాలు
నివేదికలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి కూడా ప్రస్తావించింది. అణు సంబంధిత మిలిటరీ నిర్మాణాలపై దాడులు, మూడవ పక్ష డిస్‌ఇన్‌ఫర్మేషన్ వల్ల సాధారణ యుద్ధం అణు సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని ఎస్‌ఐపీఆర్‌ఐ పరిశోధకుడు మ్యాట్ కోర్డా హెచ్చరించారు.
ప్రపంచంలోని తొమ్మిది అణు శక్తులలో రష్యా (5,459) మరియు అమెరికా (5,177) అత్యధిక అణు ఆయుధాల్ని కలిగి ఉన్నట్లు నివేదిక తెలిపింది. చైనా, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా దేశాలన్నీ ద్వంద్వ సామర్థ్య గల క్షిపణులు (dual-capable missiles) అభివృద్ధి చేస్తున్నాయని తెలిపింది. 2000ల వరకు బహుళ యుద్ధశస్త్రాలకోసం క్షిపణులను అభివృద్ధి చేసిన దేశాల్లో ఇప్పుడు చైనా, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా కూడా చేరాయి.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.