ఇటీవలికాలంలో తిరుమలకు కాలి నడకన వస్తున్న భక్తుల్లో గుండె సంబంధిత కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు ఎక్కువగా మెట్ల మార్గాన్ని ఎంచుకుంటుంటారు. నిట్టనిలువున ఉన్న కాలిబాటన ఇలాంటి వారు రావడం మంచిది కాదన్న ఉద్దేశ్యంతో భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పలు సూచనలు చేస్తోంది.
- 60 ఏళ్లు దాటిన వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం మంచిది కాదు.
- ఊబకాయంతో బాధపడుతున్న భక్తులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తిరుమల కొండకు నడక దారిన రావడం శ్రేయస్కరం కాదు.
- తిరుమల కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండటం కారణంగా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. కాలినడకన రావడం చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బస వ్యాధిని తీవ్రతరం చేసే అవకాశం ఉంది కనుక భక్తులు తదనగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజువారి మందులు వెంట తెచ్చుకోవడం ద్వారా సమస్యలను నివారించవచ్చు.
- కాలినడకన వచ్చే భక్తులకు ఏమైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్య సహాయం పొందవచ్చని తెలియజేయడమైనది.
- తిరుమలలోని ఆశ్వినీ ఆసుపత్రి, ఇతర వైద్యశాలల్లో 24×7 వైద్య సదుపాయం పొందవచ్చు.
- దీర్ఘకాలిక కిడ్ని వ్యాధిగ్రస్తులకు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం అందుబాటులో ఉంది.
- తిరుమలకు కాలినడకన రాదలచిన భక్తులు పై సూచనలను తప్పనిసరిగా పాటించి సహకరించవలసినదిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.