- అక్టోబర్ (నేటి) 25 నుండి 28 ఫిబ్రవరి, 2025 పశుగణన
- ఎన్యూమరేటర్లకు సహకరించాలి
తిరుపతి, అక్టోబర్ 25: 21వ అఖిల భారత జాతీయ పశు గణన కార్యక్రమం -2024ను తిరుపతి జిల్లాలో పశు సంవర్ధక శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్‌తో కలిసి ప్రారంభించి పశు గణన సర్వేకు వచ్చే ఎన్యూమరేటర్ కు ప్రజలు పూర్తి సమాచారం అందించి సహకరించాలని, పశు గణన సర్వే పక్కాగా నిర్వహించాలని వారు సంయుక్తంగా పేర్కొన్నారు.
శుక్రవారం మధ్యాహ్నం రామచంద్రా పురం మండలం, చిగురువాడ గ్రామం, సౌత్ కండ్రిగ నందు ఏర్పాటు చేసిన 21వ అఖిల భారత జాతీయ పశు గణన కార్యక్రమం -2024 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం శుక్రవారం 25 అక్టోబర్ నుండి 28ఫిబ్రవరి 2025 వరకు చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా చిగురువాడలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ మాట్లాడుతూ వ్యవసాయం ఎంత ముఖ్యమో పశు సంపద కూడా అంతే ముఖ్యం అని, అందుకే ‘పాడి- పంట’ అని అంటారు అని అన్నారు. పాడి పశువులు, పెంపుడు జంతువులు మన దైనందిన జీవితంలో ఒక భాగం అయ్యాయని తెలిపారు.
రాబోయే కాలంలో పశు సంపద ఎంతగా ప్రోత్సహిస్తే మనకు అంత అదనపు ఆదాయం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం దేశం మొత్తం మీద జరుగుతున్న పశు గణన అని, 16 రకాల జంతువులను గణన చేయనున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల మంది పశు సంవర్ధకా శాఖ సిబ్బంది ఉన్నారని, ఈ సర్వే లో రాష్ట్ర వ్యాప్తంగా 5500 మంది ఎన్యూమరేటర్లు, 1200 సూపర్వైజర్లు పాల్గొంటున్నారని తెలిపారు. గత పశు గణనలో తెలిసిందేమంటే పాడి పశువుల శాతం పెరిగిందని తెలిపారు. ఈ పదు గణన సర్వే పక్కాగా పటిష్టంగా నిర్వహించాలని అన్నారు.
పశు సంవర్ధక శాఖలోని సిబ్బంది గ్రామాల్లో పాడి రైతులకు చెందిన పశువులకు పుట్టినప్పటి నుండి వాటికి క్యాలెండర్ టైం లైన్ మేరకు పక్కాగా వాక్సినేషన్ చేస్తే వాటికి ఎలాంటి రోగాలు రాకుండా కాపాడుకోవచ్చని అన్నారు. ఆరోగ్యకరమైన పశు సంపద ఎంతో అవసరం అని అన్నారు. పాడి రైతులకు అవసరమైన అన్ని సేవలు ఎప్పటికప్పుడు గ్రామాల్లో అందుబాటులో ఉండి అందించాలని సూచించారు.
కృత్రిమ గర్భ ధారణకు సీమెన్ అందుబాటులో ఉన్నదని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. డీ-వార్మింగ్ పక్కగా చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం పశు అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ 21వ అఖిల భారత పశుగణన 2024 కార్యక్రమం నేటి నుండి అనగా ఈనెల 25 అక్టోబర్ నుండి 28ఫిబ్రవరి 2025 వరకు చేపడుతున్న నేపథ్యంలో వచ్చే విషయ సేకరణ దారుడికి పశువుల సమగ్ర సమాచారం అందించి సహకరించాలని, తద్వారా పశు గణన రంగ పథకాల రూపకల్పనలో సదరు సమాచారం ఎంతగానో ఉపయోగ పడుతుంది అని తెలిపారు.
ప్రతి కుటుంబంలో ఉన్న పశువులు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పౌల్ట్రీ తదితర పశు సంపద కు సంబంధించిన వివరాలు సేకరించడానికి శాఖ తరపున ఒక ఎన్యుమరేటర్ వస్తారని, వివరాల సేకరణ అనంతరం సదరు ఇంటి గోడపై స్టికర్ మార్కింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు.
వీధిలో తిరుగుతున్న పశువులు, కుక్కలు తదితర పశువుల వివరాలు కూడా సేకరిస్తారని తెలిపారు. ఈ సర్వే కొరకు జిల్లాలో 472 మంది ఎన్యుమరేటర్ లను, 77 మంది సూపర్వైజర్లను నియమించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలుచోట్ల మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యే లు తదితర ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొంటున్నారని అన్నారు.
ఎస్వీ పశు వైద్య కళాశాల రిజిస్ట్రార్ రవికుమార్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్ పెంపుడు జంతువులు కోళ్లు, గేదెలు, ఆవులు తదితర వివరాలు పూర్తి సమాచారం సేకరిస్తారు అని వారికి సరైన సమాచారం అందిస్తే ప్రభుత్వం తయారు చేసే ప్రణాళికలకు ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి రవికుమార్, పశు సంవర్థక శాఖ అధికారులు, ఎంపీపీ సుధాకర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.