రాష్ట్రంలోనే తొలిసారిగా ధరల స్థిరీకరణకై రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కమిటీని వేయడం జరిగిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఆ కమిటీకి చైర్మన్‌గా ఉంటారని ఆర్థిక, ఆరోగ్య, వ్యవసాయ శాఖల మంత్రులు సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారని చెప్పారు.
ఈ కమిటీ ఏర్పాటు అయిన తదుపరి కందిపప్పు రేటును రూ.180/- నుండి రూ.160/-కి తదుపరి రూ.150/-తగ్గించే విధంగా హాల్ సేల్ డీలర్లతో మాట్లాడం జరిగిందన్నారు. ఎవరూ ఊహించని విధంగా రేషన్ డిపోల ద్వారా కేజీ కందిపప్పు కేవలం రూ.67/- లకే అందజేయడం జరుగుచున్నదన్నారు.
పామాయిల్‌పై ఉన్న కస్టం డ్యూటీని కేంద్రం 7 శాతం నుండి 27 శాతానికి పెంచిన నేపథ్యంలో రూ.92/-ల ఉన్న దాని ధర దాదాపు రూ.130/- లకు పెరిగిందన్నారు. అయితే తమ కమిటీ చొరవతో దాని ధర రూ.110/- లకు తగ్గించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,300 అవుట్ లెట్స్ ద్వారా ప్రజలకు పంపిణీ చేయడం జరుగుచున్నదన్నారు.
అదే విధంగా ఉల్లిపాయి, టొమాటా ధరలను నియంత్రించేందుకు మార్కుఫెడ్ సహకారంతో రాయితీపై తక్కువ ధరలకే అన్ని కేంద్రాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం క్రింద అర్హులైన వారందిరికీ 2029 వరకూ ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసే విధంగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
అయితే రాష్ట్రంలోనున్న తెల్ల కార్డుల్లో 60 శాతం కార్డులకు మాత్రమే ఈ పథకం వర్తింపు అవుతున్నదని, మిగిలిన 40 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ మరియు కార్యదర్శి వీరపాండ్యన్, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.