ఢిల్లీ: రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో భారత్, చైనా నేతల మధ్యన చర్చలు ఫలితాలను ఇస్తున్నట్లు కనిపిస్తోంది. భారత సరిహద్దుల్లోని తూర్పు లడఖ్ ప్రాంతం నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్తున్నట్టు భారత రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నట్లు పేర్కొన్నారు.
రష్యాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా జింగ్ పింగ్ మధ్యన చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అంతకు ముందు రెండు దేశాల సైనికాధికారులు అనేక దఫాలు చర్చలు జరిపారు. అన్నింటిని కలగలిపిన తరువాత బ్రిక్స్ సమావేశాల సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే బలగాలు వెనక్కి వెళ్తున్నట్టు స్పష్టం చేసింది.
భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) ఉద్రిక్తతలకు సడలించాలని రెండు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగానే సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైందని భారత రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. తూర్పు లఢఖ్ సెక్టార్‌లోని రెండు కీలక ప్రాంతాలైన డెమ్ చౌక్, డెప్సాంగ్ నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్తున్నట్టు అధికారులు చెప్పారు.
సైనిక సామగ్రి, ఇతర పరికరాలను భారత బలగాలు వెనక్కి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు దేశాల బలగాలు అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత మరికొన్ని రోజుల్లోనే డెస్పాంగ్, డెమ్బోక్ ప్రాంతాల్లో పెట్రోలింగును ఉమ్మడిగా ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.