విద్యార్థుల జీవితాలతో బాబు చెలగాటం : గడికోట శ్రీకాంత్ రెడ్డి
ఎన్నికల ముందు తల్లికి వందనం పేరుతో ఊరువాడా ఊదరగొట్టారు. ఫీజు రియింబర్స్మెంటు పెంచుతామని నమ్మబలికారు. చివరకు వచ్చే అమ్మఒడికి ఎగనామం పెట్టారు. ఫీజు రియింబర్స్మెంటుకు పంగనామాలు పెట్టారని వాటి మాటే ఎత్తడం లేదని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని దుయ్యబట్టారు.
గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జగన్ పాలనలో నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం,ఐటివైపు అడుగులు, సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానల్స్, 8వ తరగతి వచ్చే సరికే ట్యాబుల పంపిణీ, విద్యాకానుక, రోజుకో మెనూ తో గోరుముద్ద… ఇలా పేద పిల్లల తలరాతలను మార్చే చదువులను అందించడానికి ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశారన్నారు.
కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరచడం జరిగిందని,డిజిటల్ క్లాస్ రూములను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేశామని చెప్పారు. కూటమి పాలనలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ అధ్వాన్నంగామారుతోందని విమర్శించారు. తమ ప్రభుత్వ హాయంలో జగన్మోహన్ రెడ్డిగారు ప్రవేశపెట్టిన విద్యా పథకాలను ఒకొక్కటిగా రద్దు చేస్తూ వస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. తల్లిదండ్రులను పిల్లలను పాఠశాలలకు పంపడం మానేస్తున్నారని అన్నారు.
పిల్లలు, తల్లులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని, అది తల్లికి వందనం ఎక్కడుందని ప్రశ్నించారు. ఆ పథకం తల్లికి వందనం అనడం కంటే పిల్లలు, తల్లులకు పంగనామం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఘాటు వ్యాఖ్యానించారు. ‘ నీకు పదిహేను.., నీకు పదిహేను.., నీకు పదిహేను..’ ఎమయ్యిందని ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు బకాయిలను కూటమి ప్రభుత్వం త్వరగా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
కళాశాల ఫీజు,హాస్టల్, మెస్ ఫీజులు చెల్లించలేక విద్యార్థులు సతమతమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఫీజులు కట్టాలని ఇప్పటికే కొన్ని కళాశాలలు విద్యార్థులను వేధిస్తున్నాయన్నారు. అదే ముఖ్యమంత్రిగా జగన్ ఉండి ఉంటే సక్రమంగా అమ్మఒడి అందేదని, క్వార్టర్ ముగియ గానే ఫీజు రీయంబర్స్ మెంట్ ,వసతి దీవెన, విద్యాదీవెన లకు డబ్బులును నేరుగా తల్లుల ఖాతాల్లో వేసేవారని అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు బాహాటంగానే చెప్పుకుంటున్నారన్నారు.