-
ఆపరేషన్ సింధూరం తరువాత మురీద్కేలో మళ్లీ చురుకైన కదలికలు
-
అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్రబిందువుగా మారిన మురీద్కే మార్కజ్
ఆపరేషన్ సింధూరం అనంతరం భారత వాయుసేన దాడులకు గురైన పాకిస్తాన్‌లోని మురీద్కేలో లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మళ్లీ కదలికలు ప్రారంభించినట్టు తాజా చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం ప్రార్థనల కోసం మురీద్కే కేంద్రంలో సమవేశమైన ఉగ్రవాదుల బృందం దృశ్యాలు బయటపడ్డాయి.
ఈ ప్రదేశంలోనే ఎల్‌ఇటి స్థాపకుడు హఫీజ్ సయీద్, అతని బావ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ, అలాగే ఇటీవల అతని కుమారుడు తల్హా సయీద్ కూడా ప్రసంగాలు చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ఓ టీవీ చానెల్‌కు తెలియజేశాయి. ప్రస్తుతం ప్రార్థన మందిరం తలుపులు తెరిచి ఉన్నా, భద్రతా పర్యవేక్షణను తప్పించుకుని కొందరు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నట్టు సమాచారం.
పహల్గామ్‌లో 26 మంది పర్యాటకుల హత్య ఘటనపై ప్రతీకార చర్యగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూరం ద్వారా పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించాయి. వీటిలో కీలకంగా ఉన్నది మురీద్కే క్యాంప్.
1988లో హఫీజ్ సయీద్ స్థాపించిన మురీద్కే మార్కజ్, శిక్షణా శిబిరంగా, మేథోపదేశ కేంద్రంగా, మరియు వ్యూహాత్మక మద్దతు స్థావరంగా పనిచేసింది. ఇది ఉసామా బిన్ లాడెన్‌తో సంబంధాలు కలిగి ఉండడమే కాకుండా, 26/11 ముంబయి ఉగ్రదాడులలోనూ కీలకపాత్ర పోషించింది. ఈ క్యాంపస్‌లో పాఠశాలలు, మసీదులు, వైద్య కేంద్రాలు, నివాస గృహాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, “బహావల్‌పూర్, మురీద్కే వంటి ఉగ్రవాద స్థావరాలు అంతర్జాతీయ ఉగ్రవాదానికి విశ్వవిద్యాలయాలుగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రధాన ఉగ్రదాడుల వేర్లు – 9/11 అయినా, లండన్ ట్యూబ్ బాంబ్ పేలుళ్లైనా లేదా భారత్‌లో జరిగిన పెద్ద ఉగ్రవాద దాడులైనా – ఈ స్థావరాలతో అనుబంధం కలిగి ఉన్నాయి” అని తెలిపారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.