April 7, 2026

ప్రాంతీయ అసమానతలపై ధర్మాన హెచ్చరిక

DHARMANA PRASADA RAO

DHARMANA PRASADA RAO

ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ అసమానతలు పెరుగుతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర అభివృద్ధి కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని హితవు పలికారు. పాలకులు అందరినీ సమానంగా చూడాలని, లేనిపక్షంలో విచ్ఛిన్నకర శక్తులకు ఆజ్యం పోసినట్లవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అమరావతిని ప్రజల రాజధానిగా పిలవడాన్ని ధర్మాన ప్రశ్నించారు. ఒకే ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తూ నిధులన్నీ అక్కడే ఖర్చు చేయడం వల్ల మిగిలిన ప్రాంతాలు వెనుకబడిపోతాయని గుర్తు చేశారు. గతంలో తెలంగాణ ఉద్యమం తలెత్తడానికి నిధుల అసమాన పంపిణీనే కారణమని శ్రీకృష్ణ కమిటీ చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

తెలుగు రాష్ట్రాలకు పిడుగుల గండం ఈ వార్తను కూడా చదవండి

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఇంకా వెనుకబాటులోనే ఉన్నాయని, అక్కడ భారీ ప్రాజెక్టులు పూర్తి కావాల్సి ఉందని ధర్మాన పేర్కొన్నారు. విశాఖలో జరుగుతున్న అభివృద్ధి కూడా స్థానికులకు పెద్దగా ఉపయోగపడటం లేదని విమర్శించారు. నిధుల కేటాయింపులో తారతమ్యాలు ఉంటే వెనుకబడిన ప్రాంతాల్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడే అవకాశం ఉందని హెచ్చరించారు.

గత ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన అధికార వికేంద్రీకరణ విధానాన్ని ధర్మాన సమర్థించారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి అదే ఏకైక మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే వంశధార ప్రాజెక్టు గెజిట్ విషయంలో కొందరు తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదని, దశాబ్దాల పోరాటం తర్వాతే ట్రిబ్యునల్ తీర్పు వచ్చిందని స్పష్టం చేశారు.

#DharmanaPrasadaRao #AndhraPradesh #APPolitics #Uttarandhra #Rayalaseema #RegionalImbalance #Decentralization #YSRCP #Amaravati

తెలుగు రాష్ట్రాలకు పిడుగుల గండం ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *