KBR పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలు.. హైదరాబాద్ వాహనదారులకు కొత్త రూట్లు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన KBR పార్క్ – జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ – బంజారాహిల్స్ కారిడార్‌లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు కొత్త డైవర్షన్లు అమల్లోకి రానున్నాయి. స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రయల్ రన్ చేపడుతున్నారు. ఈ మార్పులతో వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ ట్రాఫిక్ ట్రయల్ ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు. ఈ సమయంలో వన్-వే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అమలు చేసి, భవిష్యత్తులో ఇదే మోడల్‌ను కొనసాగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ చుట్టూ యూటర్న్‌లు తగ్గించి, వాహన రాకపోకలు వేగంగా జరిగేలా ప్లాన్ రూపొందించారు. ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డెవిస్ ప్రజలు సహకరించాలని కోరారు.
NFCL వైపు నుంచి జూబ్లీహిల్స్, రోడ్ నెం.36, రోడ్ నెం.45, కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లేవారు నేరుగా వెళ్లకుండా NTR భవన్ వద్ద ఎడమవైపు తిరిగి, అక్కడి నుంచి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ – అగ్రసేన్ ఐలాండ్ – ఒమేగా హాస్పిటల్ మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ – రోడ్ నెం.45 – కేబుల్ బ్రిడ్జ్ – IKEA వైపు చేరుకోవచ్చు. ఈ మార్గం ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు ఎంపిక చేసిన కీలక డైవర్షన్‌గా భావిస్తున్నారు.
యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ నుంచి జూబ్లీహిల్స్, మాధాపూర్ వైపు వెళ్లేవారు ఇందిరానగర్ గడ్డా రోడ్ (రోడ్ నెం.5) మీదుగా వెంకటగిరి జంక్షన్ చేరుకోవాలి. అక్కడి నుంచి డైమండ్ హౌస్ – రోడ్ నెం.10 – అల్‌కాజార్ – రోడ్ నెం.36 – రోడ్ నెం.45 మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ కొత్త రూట్ వల్ల ప్రధాన జంక్షన్‌లలో ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఒకప్పుడు నగర అంచుల్లో ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి (KBR) పార్క్ పరిసరాలు ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డుగా మారాయి. గచ్చిబౌలి, మాధాపూర్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఐటీ కారిడార్ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన కనెక్టివిటీ ఈ బెల్ట్ మీదే ఆధారపడుతోంది. ఇదే ప్రాంతంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, కృష్ణానగర్ వంటి ప్రీమియం నివాస, వాణిజ్య ప్రాంతాలు ఉండటంతో ట్రాఫిక్ ఒత్తిడి మరింత పెరిగింది. అందుకే ఈ మార్పులు కేవలం తాత్కాలిక డైవర్షన్లు మాత్రమే కాదు, భవిష్యత్ హైదరాబాద్ ట్రాఫిక్ ప్లానింగ్‌కు కూడా కీలక సూచికలుగా మారనున్నాయి.
ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు కొన్ని కీలక సూచనలు కూడా జారీ చేశారు. నిర్దేశిత రూట్లలో యూటర్న్‌లు తీసుకోకూడదు, రోడ్డు ఎడమ వైపే ప్రయాణించాలి, ట్రాఫిక్ సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలి అని తెలిపారు. అలాగే గూగుల్ మ్యాప్స్ వంటి నావిగేషన్ యాప్స్ ఉపయోగించడం, అవసరమైతే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేదా కార్‌పూలింగ్‌ను ఎంపిక చేసుకోవడం మంచిదని సూచించారు. రాబోయే రోజుల్లో ఇదే రూటింగ్ శాశ్వత రూపం దాల్చే అవకాశం ఉండటంతో ఈ ట్రయల్‌ను చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

