NATO coalition political crisis ఇరాన్ యుద్ధంలో అమెరికా ఒంటరితనం?
“In a coalition, the success of one depends on the respect shown to all. Neglect your partners, and the chain breaks.”
అని Dwight D. Eisenhower ఎప్పుడో చెప్పాడు.
ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించిన తరువాత అమెరికా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సైనిక రంగంలో కాకుండా కూటమి రాజకీయాల్లో కనిపిస్తోంది. సాధారణంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పెరిగిన ప్రతిసారీ అమెరికాకు వెన్నంటి నిలిచేవి యూరప్ దేశాలే. అది ఇరాక్ యుద్ధం కావచ్చు, ఆఫ్ఘనిస్థాన్‌లో సైనిక చర్య కావచ్చు, ఉక్రెయిన్ సంక్షోభం కావచ్చు — యుద్ధం ఏదైనా అమెరికా ముందడుగు వేస్తే యూరప్ దేశాలు వెంటనే అనుసరించడం సర్వసాధారణం. కానీ ఈసారి దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉంది. యూరప్ దేశాలు జాగ్రత్త దూరం పాటిస్తున్నాయి. నేరుగా యుద్ధంలోకి దిగేందుకు వెనుకంజ వేస్తున్నాయి.
దీనికి కారణం ఏమిటి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడా? ఏకపక్ష నిర్ణయాలా? మిత్రదేశాల పట్ల కనిపిస్తున్న చిన్నచూపా? కూటమి ధర్మాన్ని పక్కన పెట్టడమా? లేక సహచర దేశాలపై అమెరికా నేతృత్వం నుంచి వస్తున్న పరుష వ్యాఖ్యలా? కారణం ఏదైనా, నాటో దేశాలు ఈసారి సహాయ నిరాకరణ వైఖరిని అవలంబిస్తున్నాయి. ట్రంప్ హూంకారాలకు లొంగడం లేదు. సంబంధం లేనట్టే వ్యవహరిస్తున్నాయి.
ఈ యుద్ధం ప్రధాన లక్ష్యం ఏమిటి? ఇరాన్‌లోని అణ్వాయుధ సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడం. అవసరమైతే అక్కడి ప్రభుత్వాన్ని మార్చడం. ఇది సాధారణ విషయం కాదు. ఒక సార్వభౌమ దేశ ప్రభుత్వాన్ని మార్చడం అంటే అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత తీవ్ర నిర్ణయం. అటువంటి చర్యకు ఒక నాటో దేశం నడుం బిగిస్తే, అది కేవలం ఆ దేశం నిర్ణయంగా మిగిలిపోదు; కూటమి బాధ్యతగా మారుతుంది. అలాంటి సందర్భంలో మిగిలిన నాటో సభ్యదేశాలతో సంప్రదింపులు జరపడం, మెజారిటీ ఆమోదం పొందడం, ముందుకు సాగాల్సిన వ్యూహాన్ని కలిసి నిర్ణయించడం సహజం. ఎప్పుడు ఏం చేయాలి, యుద్ధ లక్ష్యం ఎక్కడితో ముగియాలి, దాని రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి — ఇవన్నీ ముందుగానే స్పష్టత కావాలి. ఇదే కూటమి ధర్మం. అదే కూటమి బలం.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గత అనుభవాలు చూస్తే కూటమి సంప్రదింపుల ప్రాధాన్యం స్పష్టమవుతుంది. 2003లో Iraq Warకు ముందు అమెరికా అధ్యక్షుడు George W. Bush మిత్రదేశాలతో విస్తృత చర్చలు జరిపారు. ఐక్యరాజ్యసమితి వేదికగా వాదోపవాదాలు సాగాయి. NATOలో విభేదాలు వచ్చినా, బ్రిటన్, స్పెయిన్, పోలాండ్ వంటి దేశాలు మద్దతు ప్రకటించాయి; ఫ్రాన్స్, జర్మనీ వ్యతిరేకించాయి. అయినప్పటికీ చర్చలు, రాజనీతిక ఒత్తిళ్లు, మిత్రదేశాల సమీకరణ ప్రక్రియ ముందుగానే సాగింది. అదే విధంగా 2001లో ప్రారంభమైన War in Afghanistan సందర్భంలో తొలిసారిగా నాటో ఆర్టికల్-5 అమలైంది. “ఒక దేశంపై దాడి అంటే అన్ని దేశాలపై దాడి” అనే సూత్రంతో అమెరికాకు కూటమి మద్దతు లభించింది. బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ సహా అనేక దేశాలు ప్రత్యక్షంగా సైనిక బలగాలు పంపాయి. ఈ రెండు ఉదాహరణలు ఒక విషయం చెబుతున్నాయి — విభేదాలు ఉన్నా, నిర్ణయాలు కూటమి స్థాయిలోనే చర్చల తర్వాత తీసుకున్నారు.
ఇక 2002లో పాలస్తీనా నేత Yasser Arafatను ఇజ్రాయెల్ ప్రధాని Ariel Sharon రామల్లాలో నిర్బంధించినప్పుడు కూడా అంతర్జాతీయ స్పందన వెంటనే వచ్చింది. అమెరికా, యూరప్ దేశాలు ఒత్తిడి తీసుకొచ్చాయి; అరాఫత్‌ను పూర్తిగా తొలగించడానికి ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతు ఇవ్వలేదు. ఈ రెండు పరిణామాలు కూడా ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి — మిత్రదేశాల అభిప్రాయాలను పక్కన పెట్టి పెద్ద వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం అరుదు; కూటమి సమన్వయం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక అంశం.అలాగే 2022లో ప్రారంభమైన Russian invasion of Ukraine తరువాత కూడా అమెరికా ఏకపక్షంగా ముందుకెళ్లలేదు. నాటో, యూరోపియన్ యూనియన్, జి-7 దేశాలతో నిరంతర సమన్వయం కొనసాగింది. ఆంక్షలు, ఆయుధ సహాయం, ఆర్థిక మద్దతు అన్నీ కూటమి విధానంలోనే అమలయ్యాయి.
“యుద్ధంలో మిత్రులు కేవలం సహాయకులు కాదు; విజయాన్నీ, లాభాన్నీ సమకూర్చే శక్తి.”
2019లో వెనుజులా రాజకీయ సంక్షోభం సమయంలో అమెరికా అధ్యక్షుడు Donald Trump ప్రభుత్వం ప్రతిపక్ష నేత Juan Guaidóను తాత్కాలిక అధ్యక్షుడిగా బయట నుంచి గుర్తించింది అంతే ఎక్కడా అధికార మార్పిడి జరగలేదు. మడురోనే అధ్యక్షుడుగా పాలనా వ్యవహారాలు చూశారు. కానీ ఇది ఒక్క అమెరికా నిర్ణయం మాత్రమే కాదు. కెనడా, బ్రెజిల్, కొలంబియా సహా అనేక దేశాలు అదే వైఖరిని ప్రకటించాయి. ముఖ్యంగా Lima Group దేశాలు అమెరికాతో కలిసి మద్దతు తెలిపాయి. అంటే ప్రభుత్వం మార్పు లక్ష్యం ఉన్నప్పటికీ, ముందుగా మిత్రదేశాలను కలుపుకునే ప్రయత్నం జరిగింది. పూర్తి ఏకాభిప్రాయం రాకపోవడంతో అధ్యక్షుడు Nicolás Maduroను తొలగించేందుకు ప్రత్యక్ష సైనిక చర్యకు అమెరికా దిగలేదు. అంటే ఇక్కడ కూటమి మాటకు విలువనిచ్చింది.
రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే అమెరికా అధ్యక్షుడు Donald Trump వెనుజులా అంశంపై కఠిన వైఖరి అవలంబించారు. చివరకు 2026లో వెనుజులా అధ్యక్షుడు Nicolás Maduro ను అమెరికా సైనిక చర్యతో నిర్బంధించిన ఘటనపై విస్తృత విమర్శలు వెల్లువెత్తాయి. ముందస్తు కూటమి సంప్రదింపులు కనిపించలేదని అనేక దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ చర్యను సార్వభౌమాధికార ఉల్లంఘనగా కూడా పేర్కొన్నారు. మిత్రదేశాల స్పష్టమైన మద్దతు లేకుండానే జరిగిన ఈ చర్య అప్పుడే అమెరికా ఏకపక్ష ధోరణిపై ప్రశ్నలు లేవనెత్తింది.
అమెరికా మిత్రదేశాల పట్ల ఇటీవలి ధోరణి కూడా యూరప్ దేశాల్లో అనుమానాలను పెంచింది. డెన్మార్క్‌కు చెందిన Greenland ను స్వాధీనం చేసుకోవాలన్న వ్యాఖ్యలు మిత్రదేశాలనే అసౌకర్యానికి గురిచేశాయి. అంతేకాదు, Canada తో వాణిజ్య, భద్రతా అంశాలపై వచ్చిన ఘర్షణలు సంబంధాల్లో చల్లదనాన్ని తెచ్చాయి. అలాగే సరిహద్దు భద్రత పేరుతో Mexico పై పెత్తనం ప్రదర్శించాలన్న ధోరణి పొరుగు దేశాల్లో ఆందోళన కలిగించింది. ఈ పరిణామాలు అమెరికా నాయకత్వంపై మిత్రదేశాల్లో నమ్మకాన్ని దెబ్బతీశాయి. అదే అవిశ్వాసం ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో సహకారాన్ని తగ్గిస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Read this article also: రష్యా ఖజానా ఖాళీ అవుతోందా? 25 ఏళ్ల తర్వాత Gold నిల్వల విక్రయం!
వాణిజ్య, వ్యాపార, భౌగోళిక అంశాల్లో కీలకమైన అటు ఎర్ర సముద్రం, ఇటు హెర్ముజ్ జలసంధి మధ్య ఉన్న ప్రాంతంలో ప్రభావం కలిగిన దేశం ఇరాన్. విశాలమైన భూభాగం, గణనీయమైన సైనిక బలం, ప్రాంతీయ మిత్రబలగాలతో కూడిన శక్తి. అలాంటి దేశంపై యుద్ధానికి సిద్ధమవడం చిన్న విషయం కాదు. అంతర్జాతీయ వాణిజ్య మార్గాలు, చమురు సరఫరాలు, సముద్ర రవాణా భద్రత — అన్నీ ఒకేసారి ప్రభావితమయ్యే అవకాశముంది. అలాంటి సమయంలో కూటమి దేశాలతో ముందస్తు చర్చలు జరగాలి కదా? వ్యూహం, లక్ష్యం, బాధ్యతల పంపకం, యుద్ధానంతర పరిస్థితులపై స్పష్టత తీసుకురావాలి కదా? కానీ ఇరాన్ విషయంలో అమెరికా లేదా ట్రంప్ కూటమి దేశాలతో అటువంటి సమగ్ర సంప్రదింపులు జరిపిన ఆనవాళ్లు కనిపించడం లేదు. ఇదే మిత్రదేశాల్లో అసౌకర్యాన్ని పెంచాయి.
ఎందుకంటే, హోర్ముజ్ మార్గంపై ఆధారపడే యూరప్ దేశాల్లో ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, గ్రీస్, నెదర్లాండ్స్, బెల్జియం, పోలాండ్ వంటి దేశాలు ఉన్నాయి. మధ్యప్రాచ్య చమురు దిగుమతుల్లో ఆధారపడే శాతం 15 నుంచి 35 శాతం మధ్య ఉంటుంది. యూరప్ దేశాలకు రోజుకు సుమారు 2.5 నుంచి 3 మిలియన్ బ్యారెల్స్ చమురు హెర్ముజ్ జలసంధి ద్వారా చేరుతుంది. ఒక్క బ్యారెల్ ధర 80 డాలర్లుగా లెక్కిస్తే రోజువారీ విలువ సుమారు 200 నుంచి 240 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది. వార్షికంగా ఇది 70 నుంచి 85 బిలియన్ డాలర్ల వరకూ చేరుతుంది. అయితే యూరప్ చమురు దిగుమతుల్లో నార్వే, అమెరికా, ఆఫ్రికా దేశాల వాటా కూడా గణనీయంగా ఉంది. అంటే హోర్ముజ్ కీలకం అయినప్పటికీ పూర్తి ఆధారపడడం లేదు. ఈ కారణంగానే యూరప్ దేశాలు యుద్ధంలోకి దూకే ప్రమాదాన్ని తీసుకోవడం లేదు. ప్రయోజనం ఉన్నా ప్రమాదం ఎక్కువగా ఉందన్న లెక్కలు వాటి నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి.
“మిత్ర కూటమిలో అనుమానం చీలికకు నాంది; అపనమ్మకం కూటమికే ప్రమాదం.”
2022లో Russian invasion of Ukraine ప్రారంభమైన తర్వాత అమెరికా నేతృత్వంలో రష్యాపై కఠిన ఆంక్షలు విధించబడ్డాయి. ముఖ్యంగా Russia నుంచి చమురు, గ్యాస్ కొనుగోళ్లు తగ్గించాలని యూరప్ దేశాలపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. దశాబ్దాలుగా చవక ధరలకు ఇంధనం పొందుతున్న యూరప్ దేశాలు ఒక్కసారిగా ప్రత్యామ్నాయ వనరులు వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. అమెరికాకు స్వదేశీ ఉత్పత్తి అధికంగా ఉండటంతో ప్రభావం తక్కువగా పడగా, యూరప్ దేశాలు మాత్రం ఇంధన కొరతను ఎదుర్కొన్నాయి. ఫలితంగా ఇంధన ధరలు పెరిగాయి, పారిశ్రామిక రంగం దెబ్బతింది, ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ పరిణామాలు European Union దేశాలకు ఆర్థికంగా భారంగా మారాయి.
ప్రస్తుతం ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఎటువంటి ముందస్తు అభిప్రాయ సేకరణలు, కూటమి స్థాయి సమావేశాలు, వ్యూహాత్మక సమీక్షలు లేకుండానే అమెరికా ఇరాన్‌పై యుద్ధానికి దిగింది. ఇజ్రాయెల్‌తో కలిసి ఆ దేశ అగ్రనాయకత్వాన్ని, కీలక అధికారులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. అయితే ఇరాన్ ఊహించిన దానికంటే భిన్నంగా స్పందించింది. వ్యూహాత్మకంగా అమెరికా సైనిక స్థావరాలు, అమెరికాకు ఆశ్రయం ఇచ్చిన గల్ఫ్ దేశాలపై దాడులు పెంచింది. ఈ పరిణామం అమెరికాను రక్షణాత్మక స్థితిలోకి నెట్టింది. పరిస్థితి మరింత సంక్లిష్టమవుతుండగానే ఇరాన్ హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాను కట్టడి చేయడం అమెరికాకు కొత్త ఒత్తిడిని సృష్టించింది. ప్రాంతీయ యుద్ధంగా మొదలైన పరిణామం ఒక్కసారిగా ప్రపంచ ఇంధన భద్రత సమస్యగా మారింది. ఈ దశలో అమెరికా దీనిని అంతర్జాతీయ సమస్యగా మలుస్తూ, ముఖ్యంగా యూరప్ దేశాలపై బాధ్యత మోపే ధోరణిని అవలంబించడం గమనార్హం.
Read this article also : ఎన్నికల వరకు తగ్గింపులు… తర్వాత పెంపులు — ఇదే మళ్లీ పునరావృతమవుతుందా?
భద్రత అమెరికా బాధ్యత కాదని, దాన్ని వినియోగించే దేశాలే చూసుకోవాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. “That’s not for us… that’ll be for France”, “Whoever’s using the strait should protect it”, “Go get your own oil” వంటి వ్యాఖ్యలు యూరప్‌లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఇవి కేవలం వ్యూహాత్మక సూచనలు కాకుండా మిత్రదేశాలపై బాధ్యత నెట్టివేయాలన్న సంకేతాలుగా భావించబడ్డాయి. కూటమి రాజకీయాల్లో సాధారణంగా వినిపించని ఈ భాషను కొందరు మిత్రదేశాలపై హేళనగా కూడా విశ్లేషించారు. సహకారం కోరే స్థానం నుంచి బాధ్యత మోపే స్వరానికి మారడం, అంతర్గత విభేదాలను బహిర్గతం చేసినట్లయింది.
ఈ వ్యాఖ్యలకు అనుగుణంగా అమెరికా ప్రభుత్వంలోని ఇతర అగ్రాధికారులు కూడా అదే స్వరాన్ని అందుకున్నారు. పీట్ హెగ్సెత్ హోర్ముజ్ మార్గాన్ని రక్షించడం కేవలం అమెరికా నేవీ బాధ్యత కాదని, “There’s supposed to be a big, bad Royal Navy” అంటూ బ్రిటన్‌ను ప్రస్తావించడం మరింత చర్చకు దారి తీసింది. బాధ్యత పంచుకోవాలని సూచించడం ఒక విషయం; కానీ విమర్శల రూపంలో మిత్రదేశాలపై ఒత్తిడి తెచ్చే భాష వాడటం మరో విషయం. ఈ పరిణామాలు కూటమి రాజకీయాల్లో నమ్మక సంక్షోభాన్ని మరింత పెంచుతున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది.
ఈ పరిణామాలు యుద్ధరంగం బయట మరో సంక్షోభాన్ని సూచిస్తున్నాయి — కూటమి ఐక్యతాభావమే ప్రశ్నార్థకమవుతోంది.
English Summary :
NATO coalition political crisis The U.S. unilateral military actions against Iran have exposed not a shortage of American firepower, but a crisis within its coalition politics. Historically, whenever tensions in the Middle East escalated—whether during the Iraq War (2003), the Afghanistan intervention (2001), or the Ukraine crisis (2022)—European allies stood firmly alongside the United States, offering military support or coordinating sanctions. However, in the current Iran standoff, European nations are maintaining a cautious distance, wary of direct involvement. Strategic control over the Strait of Hormuz, vital oil exports, and regional military threats have heightened stakes, yet Trump’s administration proceeded without prior consultations with NATO allies, treating coalition responsibilities more as obligations for others than shared duties. His disparaging remarks toward Europe, including comments such as “Go get your own oil” and “That’s not for us… that’ll be for France,” have fueled doubts and strained trust, turning coalition politics into a diplomatic minefield.
Past experiences underscore the importance of coalition consensus: the U.S. sought broad allied approval during the Iraq invasion, coordinated NATO Article 5 responses in Afghanistan, and consulted European partners over Ukraine sanctions. Even during interventions like the 2019 Venezuelan political crisis, the U.S. worked with allies before taking action, whereas the 2026 Maduro operation drew sharp criticism for bypassing consultation. The Iran situation, therefore, is a vivid example of how neglecting coalition input risks strategic isolation. As Dwight D. Eisenhower once said, “In a coalition, the success of one depends on the respect shown to all. Neglect your partners, and the chain breaks.” In short, the battlefield now extends beyond Iran—it is unfolding within the fractured trust and cohesion of the U.S.-led coalition itself.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.

యుద్ధాలు చేసి.. ఆయుధాలు అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకుంటున్న ట్రంప్ తో జత కట్టాలని ఎవరనుకుంటారు. సార్..
అమెరికా.. అండ్ సో కాల్డ్ ఆయుధ కార్మాగారాల్లో ఆయుధాలు మురుగుతున్నట్లున్నాయి.. వాటిని సొమ్ము చేసుకోవడానికి ట్రంప్ ను ఆ వ్యాపరస్తులు సమరం వైపునకు నెట్టుతున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది.. ఆయుధం ఎంత గొప్పదైనా వాడే అవసరం బట్టీ పొరుగు వారు తోడై నిలుస్తారు.. ఆ అమెరికా అహంకారికి ఇంకా ఆ విషయం తెలియక ఇరాన్ తయారు చేస్తున్న బెలూన్ ( రబ్బర్ ) ఆయుధాలపై కోట్ల విలువైన బాంబులతో దాడులు చేస్తూ ట్రంప్.. ఉక్కిరి బిక్కిరి అవుతుండడం మిక్కిలి సంతోషంగా ఉంది.
మంచి పరిశీలన కలిగి ఉన్నారు మీరు. హెర్ముజ్ జలసంధి విడిపించకపోతే ఒక ప్రమాదం విడిపిస్తే అమెరికాతో ప్రమాదం.
హెర్ముజ్ జలసంధిపై పొట్టు కోసం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టే రోజులు ఎంతో దూరంలో లేదు.