March 14, 2026

అస్సాంలో ఎన్నికల శంఖారావం: రూ. 23,550 కోట్లతోప్రాజెక్టుల జాతర!

Silcharలో పలు ప్రాజెక్టులను ప్రకటిస్తున్న ప్రధానమంత్రి మోడీ

అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనున్న వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టుల వర్షం కురిపించారు. శనివారం సిల్చార్ పర్యటనలో భాగంగా ఏకంగా రూ. 23,550 కోట్ల విలువైన వివిధ పథకాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ఈశాన్య భారతంలోనే మొట్టమొదటి ‘యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే’కు భూమిపూజ చేయడం ద్వారా ఈ ప్రాంత రవాణా ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రధాని అడుగులు వేశారు.

రూ. 22,864 కోట్లతో నిర్మించనున్న ఈ గ్రీన్ ఫీల్డ్ హైస్పీడ్ కారిడార్ సిల్చార్ (కాచర్ జిల్లా) నుంచి మేఘాలయలోని షిల్లాంగ్‌ను కలుపుతుంది. 166 కిలోమీటర్ల మేర సాగే ఈ నాలుగు వరుసల రహదారి అందుబాటులోకి వస్తే, గౌహతి – సిల్చార్ మధ్య దూరం 295 కిలోమీటర్ల నుంచి 252 కిలోమీటర్లకు తగ్గుతుంది. దీనివల్ల ప్రస్తుతం పడుతున్న 8.5 గంటల ప్రయాణ సమయం కేవలం 5 గంటలకు తగ్గిపోనుందని అధికారులు వెల్లడించారు.

Read this article also : మాకు చెప్పి.. మోడీ జీ..! మీకెందుకంత వణుకు? : రాహుల్

రవాణా సౌకర్యాలతో పాటు సిల్చార్ నగరంలోని ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రూ. 565 కోట్లతో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్‌కు కూడా మోదీ భూమిపూజ చేశారు. నేషనల్ హైవే-306 పై ట్రంక్ రోడ్ నుంచి రంగిర్‌ఖారీ పాయింట్ వరకు నిర్మించే ఈ ప్రాజెక్టు, పొరుగు రాష్ట్రాలైన మిజోరాం, త్రిపుర, మణిపూర్‌లతో అనుసంధానతను పెంచడమే కాకుండా బరాక్ వ్యాలీ ఆర్థికాభివృద్ధికి కీలకం కానుంది. వీటితో పాటు కరీంగంజ్ జిల్లాలోని పాతర్‌కండి వద్ద రూ. 122 కోట్లతో నిర్మించనున్న అగ్రికల్చర్ కాలేజీకి ప్రధాని శంకుస్థాపన చేశారు.

వరుసగా మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి, ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. శుక్రవారం నుంచి ఇప్పటివరకు అస్సాంలో మొత్తం రూ. 47,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించడం గమనార్హం. ఏప్రిల్‌లో జరగనున్న ఎన్నికలకు ముందు ఈ భారీ కేటాయింపులు ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.


English Summary:

Prime Minister Narendra Modi unveiled development projects worth ₹23,550 crore in Silchar, Assam, including the Northeast’s first access-controlled expressway connecting Silchar to Shillong. This ₹22,864-crore greenfield corridor will significantly reduce travel time between Guwahati and Silchar from 8.5 hours to 5 hours. Additionally, he laid the foundation for an elevated corridor to ease traffic in Silchar and a new agricultural college in Karimganj, signaling a massive infrastructure push ahead of the upcoming April assembly elections.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *