March 11, 2026

ఆ నాటకాలు ఇక సాగవు: మంత్రి అచ్చెన్నాయుడు

ATCHEM NAIDU

ATCHEM NAIDU

రాష్ట్రంలో వ్యవసాయం, రైతుల సమస్యలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ స్వార్థంతో కూడినవేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం అమరావతిలో విడుదల చేసిన ప్రకటనలో, రైతుల పేరుతో అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం జగన్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో అన్నదాతలను అప్పుల ఊబిలోకి నెట్టి, ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెల్లింపులు నిలిపేసింది మీరు.. ఆదుకుంటోంది మేము!

గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఇవ్వాల్సిన అనేక బకాయిలను జగన్ నిలిపివేశారని మంత్రి విమర్శించారు. ముఖ్యంగా.. గతంలో కేంద్రం ఇచ్చే రూ.6,000 కూడా కలిపి ‘రైతు భరోసా’గా ప్రచారం చేసుకున్నారని, కానీ కూటమి ప్రభుత్వం ఏటా రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. ఇప్పటికే రెండు విడతలుగా రూ.6,309 కోట్లు పంపిణీ చేశామని, ఈ నెల 13వ తేదీన మూడో విడత నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్ సర్కార్ బీమా ప్రీమియంలు చెల్లించకపోవడంతో రూ.1,990 కోట్ల అదనపు భారం తమ ప్రభుత్వంపై పడిందని, అయినప్పటికీ రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వరి పంటకు ఇన్‌పుట్ సబ్సిడీని రూ.17,000 నుండి రూ.25,000కు పెంచామని, ఇప్పటికే సుమారు రూ.310 కోట్లు రైతులకు పంపిణీ చేశామని వెల్లడించారు.

సూక్ష్మ సాగుపై నిర్లక్ష్యం.. పెండింగ్ బకాయిల విడుదల

గత ఐదేళ్లలో బిందు, తుంపర్ల సేద్యాన్ని (మైక్రో ఇరిగేషన్) వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 2020-22 మధ్య ఈ పథకాన్ని ఆపేయడమే కాకుండా రూ.1,166 కోట్ల బకాయిలు మిగిల్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రూ.1,857 కోట్లతో 2.33 లక్షల హెక్టార్లకు ఈ పథకాన్ని విస్తరించామని వివరించారు. అలాగే, గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు మిగిలిపోయిన రూ.5.67 కోట్ల పరిహారాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వమే విడుదల చేసిందని గుర్తు చేశారు.

ధరల స్థిరీకరణకు కట్టుబడి ఉన్నాం

మిర్చి, శనగ, అరటి వంటి పంటల ధరల విషయంలో జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ధరల స్థిరీకరణ నిధి కింద బడ్జెట్ కేటాయింపులకు మించి ఇప్పటికే రూ.588 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. మొందా తుఫాను నష్టాలపై సర్వే పూర్తయిందని, కేంద్రం నిధులు రాగానే రాష్ట్ర వాటా కలిపి వెంటనే నష్టపరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని జగన్, ఇప్పుడు చేస్తున్న విమర్శలను ప్రజలెవరూ నమ్మరని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *