March 10, 2026

విశాఖ బ్యాంక్ లాభం రూ.71.77 కోట్లు:  షెడ్యూల్డ్ హోదాపై విశ్వాసం

విశాఖపట్నం, జూన్ 7: ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పన్నుల అనంతరం రూ.71.77 కోట్ల నికర లాభాన్ని సాధించింది. బ్యాంకు అన్ని అర్హతలు పొందినందున రిజర్వ్ బ్యాంకు షెడ్యూల్డ్ హోదా మంజూరు చేసే అవకాశముందని చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు తెలిపారు. ద్వారకానగర్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, దేశంలోని 1472 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో 49 బ్యాంకులకు మాత్రమే షెడ్యూల్డ్ హోదా లభించిందని గుర్తు చేశారు.

వాటిలో చాలాకంటే విశాఖ బ్యాంక్ పనితీరు మెరుగ్గా ఉందని తెలిపారు. 2025-26 నాటికి షెడ్యూల్డ్ హోదా సాధించడమే లక్ష్యంగా పాలకవర్గం ప్రణాళికలు రచించిందన్నారు. బ్యాంకు 1916లో ప్రారంభమై ప్రస్తుతం 110వ సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మల్టీ స్టేట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌గా ఇది అభివృద్ధి చెందిందన్నారు.

బ్యాంకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 51 బ్రాంచులు, హైదరాబాద్‌లో 4 బ్రాంచులతో మొత్తం 55 బ్రాంచులతో సేవలందిస్తోంది. ఈ ఏడాది నూజివీడు, తెనాలి, అమలాపురం, హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో కొత్తగా 5 బ్రాంచులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. తద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరం చివరకు మొత్తం ఆర్థిక లావాదేవీలు రూ.8600 కోట్లకు చేరడం లక్ష్యమన్నారు. బ్యాంకు ద్వారా సభ్యులకు ఆరోగ్య బీమా, ఉచిత జీవిత బీమా, విద్యా పురస్కారాలు, ప్రమాదమరణాలకు రూ.50,000 వరకు చెల్లింపులు అందిస్తున్నట్లు వివరించారు. 2024-25లో రూ.5.57 కోట్ల విలువైన సంక్షేమ సేవలు అందించారని పేర్కొన్నారు. షేర్ డివిడెండ్‌గా సభ్యులకు రూ.38.80 కోట్లు చెల్లించారని చెప్పారు. వడ్డీ రాయితీ పథకం ద్వారా 318 మంది సభ్యులకు రూ.35.31 లక్షలు మంజూరయ్యాయని వెల్లడించారు.

1984-85లో రూ.2.91 కోట్ల కార్యకలాపాలతో ప్రారంభమైన బ్యాంక్, 2024-25 నాటికి రూ.7791.20 కోట్ల స్థాయికి చేరినట్లు వివరించారు. అదే విధంగా, షేర్ డిపాజిట్లు రూ.4354.73 కోట్లు, షేర్ కేపిటల్ రూ.339.55 కోట్లు, సభ్యుల సంఖ్య 1,11,593కి పెరిగింది. బ్యాంకు ప్రతి బ్రాంచీలో మహాజనసభలు నిర్వహించి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే ప్రయత్నంలో ఉందన్నారు. బ్యాంకు ప్రత్యేకతలలో 4% సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటు, డిపాజిటర్లకు సభ్యత్వ హక్కులు, ప్రజాస్వామిక పాలన, అన్నీ cooperative principlesను పాటించడంలో స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. బ్యాంకు Capital to Risk Weighted Assets Ratio (CRAR) 11, Gross NPA 0, వంటి అంశాల్లో అత్యుత్తమ స్థాయిలో ఉందన్నారు. ఈ సమావేశంలో బ్యాంకు ఇంచార్జ్ CEO వి.వి.బి. వరలక్ష్మి, తదితర పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *