March 10, 2026

‘హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్’ విడుదల చేసిన మంత్రి అనిత

HOMEMINISTER ANITHA

HOMEMINISTER ANITHA

రాష్ట్రంలో భానుడి భగభగలు మొదలైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఈ ఏడాది ఎటువంటి ప్రాణ, పశు నష్టం జరగకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఎండ తీవ్రతపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ‘హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ – 2026’ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.

మధ్యాహ్నం వేళ పనులు వద్దు.. పనివేళల రీషెడ్యూల్

ఎండ తీవ్రత అత్యధికంగా ఉండే మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి పనులు చేయవద్దని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు, భవన నిర్మాణ కార్మికుల పనివేళలను మార్చాలని అధికారులను కోరారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లల విషయంలో కుటుంబ సభ్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని మంత్రి సూచించారు.

చలివేంద్రాల ఏర్పాటు.. పశువులకు నీటి సౌకర్యం

నగరాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థల సహకారంతో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మజ్జిగ, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. మూగజీవాలకు ఎండ దెబ్బ తగలకుండా గ్రామాల్లోని నీటి తొట్టెలను ట్యాంకర్లతో నిరంతరం నింపాలని పశుసంవర్ధక శాఖను ఆదేశించారు. వేసవిలో గృహ అవసరాలకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని విద్యుత్ శాఖకు స్పష్టం చేశారు.

వైద్యశాలల్లో ప్రత్యేక బెడ్లు.. అగ్నిమాపక తనిఖీలు

వడదెబ్బ బారిన పడే వారి కోసం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లు, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని మంత్రి అనిత ఆదేశించారు. అలాగే, వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఆసుపత్రులు, హోటళ్లు, మాల్స్‌లో ఫైర్ సేఫ్టీ తనిఖీలు నిర్వహించాలని అగ్నిమాపక శాఖను కోరారు. చెరువులు, కుంటల వద్ద పిల్లలు ప్రమాదాల బారిన పడకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
#AndhraPradesh #Summer2026 #HeatWave #VangalapudiAnitha #APGovernment #StaySafe #PublicHealth #DisasterManagement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *