March 17, 2026

న్యాయం అడిగితే బేడీలా?: కార్మికులు

CPM PORATAM IN TIRUPATI

CPM PORATAM IN TIRUPATI

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో కార్మికులు చేపట్టిన న్యాయపోరాటం ఉధృతరూపం దాల్చింది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కార్మికులు చేస్తున్న పోరాటం నేడు 19వ రోజుకు చేరుకుంది. యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ కార్మికులు వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. చేతులకు దారాలను బేడీల్లా చుట్టుకుని, కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని “మా బాధలు మీకు కనిపించడం లేదా?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి రోగులకు సేవలందిస్తున్న తమ పట్ల వివక్ష చూపడం తగదని వారు హెచ్చరించారు.

నేడు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు స్విమ్స్ ఆవరణలో కార్మికులు శాంతియుత నిరసన చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకోవడం ద్వారా యాజమాన్యానికి తమ సమస్యలు పట్టడం లేదని ప్రతీకాత్మకంగా చాటిచెప్పారు. సిఐటియు నగర ఉపాధ్యక్షులు కే. వేణుగోపాల్ మరియు యూనియన్ నేతలు ఈ సందర్భంగా మాట్లాడుతూ, 19 రోజులుగా రోడ్లపై దీక్షలు చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. నిర్బంధాలతో కార్మికుల గొంతు నొక్కాలని చూడటం ప్రజాస్వామ్య విరుద్ధమని వారు స్పష్టం చేశారు.

స్విమ్స్ వైద్యుడికి జాతీయ అవార్డు ఈ వార్త కూడా చదవండి

కార్మికుల ప్రధాన పోరాటం ప్రస్తుతం అమలులో ఉన్న శానిటేషన్ విధానానికి వ్యతిరేకంగా సాగుతోంది. ఈ విధానం పేరుతో కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకే చోట, ఒకే విధమైన పని చేస్తున్న అందరు కార్మికులకు సమాన వేతనం అందించాలని, సుమారు 800 మంది కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. వేతనాల పెంపు విషయంలో యాజమాన్యం కాలయాపన చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

ఎటువంటి వ్యత్యాసం లేకుండా స్విమ్స్ కార్మికులందరినీ వెంటనే కార్పొరేషన్‌లో చేర్చుకోవాలని యూనియన్ నేతలు జి. రవి, గోపి డిమాండ్ చేశారు. అవుట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మరియు యాజమాన్యంపై ఉందన్నారు. అపరిశుభ్రమైన వాతావరణంలో, ప్రాణాపాయ స్థితిలో పనిచేస్తున్న తమకు కనీస గౌరవం మరియు వేతనం ఇవ్వకపోవడం అన్యాయమని కార్మికులు వాపోతున్నారు.

తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని కార్మికులు భీష్మించుక కూర్చున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సూరి, మారిముత్తు, జనార్ధన్, రాజా, నాగభూషణమ్మ వంటి నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా కార్మికులు పాల్గొన్నారు. ఇప్పటికైనా స్విమ్స్ యాజమాన్యం మరియు ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలని, లేనిపక్షంలో పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, ఆసుపత్రి సేవలపై దాని ప్రభావం పడితే యాజమాన్యమే బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు.

SVIMS #Tirupati #WorkersProtest #JusticeForWorkers #CITU #HealthCareNews #WagesHike #ProtestDay19 #AndhraPradesh #LaborRights

స్విమ్స్ వైద్యుడికి జాతీయ అవార్డు ఈ వార్త కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *