March 11, 2026

ఆకాశగంగ, పాపవినాశనం అభివృద్ధిపై టీటీడీ దృష్టి

తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల అనుభూతికి ఆధునికతను మేళవించే ప్రయత్నం ప్రారంభమైంది. పర్యావరణ అనుకూలంగా, భక్తులకు మరింత అనుకూలంగా తీర్థ ప్రాంతాలైన ఆకాశగంగ, పాపవినాశనం, మరియు కేంద్రీయ విచారణ కార్యాలయం (సీఆర్వో) అభివృద్ధిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ ఈవో జె. శ్యామలరావు అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సమీక్షలో ఆ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన నిపుణులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు సమర్పించారు. భవిష్యత్తులో భక్తుల సంఖ్య పెరిగే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆధ్యాత్మికత, ప్రకృతి పరిరక్షణ, భద్రత, రవాణా సౌలభ్యం వంటి అంశాలను సమన్వయం చేసేలా రూపకల్పన చేయాలని ఈవో సూచించారు.

ఈవో మాట్లాడుతూ – “భక్తుల కోసం ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తుగా జాగ్రత్త చర్యలు చేపట్టాలి. పర్యావరణాన్ని దెబ్బతీయకుండా ఆధునిక సదుపాయాలు కల్పించాలి” అని పేర్కొన్నారు.

ఇక తిరుమలలోని సీఆర్వో ఆధునీకరణపై కూడా ప్రత్యేకంగా సమీక్ష జరిపారు. భక్తులకు వేచి ఉండే సమయంలో అనుభూతి బాగుండేలా, మరింత సౌకర్యవంతంగా సదుపాయాలు తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. సీఆర్వో పరిసరాల్లోని ఖాళీ ప్రాంతాలను సమర్థవంతంగా వినియోగించాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరి, సీఈ సత్యనారాయణ, అర్బన్ డెవలప్మెంట్ & డిజైనింగ్ నిపుణులు  రాముడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *