March 10, 2026

తెలంగాణ కేబినెట్: ఇకపై నెలకు రెండుసార్లు సమావేశాలు!

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో మరింత వేగం పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు (Cabinet meetings) నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. విధానపరమైన నిర్ణయాల (policy decisions) విషయంలో ఎటువంటి ఆలస్యం లేకుండా, క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా కేబినెట్​లో సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ నూతన విధానం ప్రకారం, ప్రతి 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలు ఉంటాయి. ప్రతి నెలలో మొదటి, మూడవ శనివారం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. మంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు, ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షించేందుకు ఇది దోహదపడుతుంది. తద్వారా పరిపాలనలో మరింత వేగం (speed) మరియు పారదర్శకతను తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 17 సార్లు కేబినెట్ భేటీలు జరిగాయి. ఈ తరహా తరచు సమావేశాలు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి, ప్రభుత్వ హామీలను సకాలంలో నెరవేర్చడానికి ఉపయోగపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ నిర్ణయం తెలంగాణ అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *