March 15, 2026

స్విమ్స్‌లో ముగిసిన రేడియాలజీ కాన్ఫిరెన్స్

TIRUPATI SVIMS

TIRUPATI SVIMS

తిరుపతి స్విమ్స్ రేడియాలజీ విభాగం, బ్రెస్ట్ ఇమేజింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రెండరోజుల మిడ్ టెర్మ్ కాన్ఫిరెన్స్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. రొమ్ము వ్యాధుల నిర్ధారణలో అత్యాధునిక సాంకేతికత, రేడియాలజిస్టుల పాత్ర అనే అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులు ఈ సదస్సులో చర్చించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ బోర్డు సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల ఆరోగ్యం కోసం ప్రభుత్వం మరియు స్విమ్స్ తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు.

శ్రీ పద్మావతి ఆడిటోరియంలో జరిగిన ఈ సదస్సులో టీటీడీ బోర్డు సభ్యురాలు ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. రోగికి సరైన చికిత్స అందడంలో రేడియాలజిస్టుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. రొమ్ము క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని ఆమె పేర్కొన్నారు. వి.పి.ఆర్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు, కోవూరు ప్రాంతాల్లో వేలాది మంది మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

స్విమ్స్ సంచాలకులు డాక్టర్ ఆర్.వి. కుమార్ మాట్లాడుతూ.. రొమ్ము వ్యాధుల స్క్రీనింగ్ కోసం స్విమ్స్‌లో అత్యాధునిక ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళల కోసం ‘పింక్ బస్’ ద్వారా ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇది 2018 నుండి నిరంతరాయంగా సేవలందిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మార్చి 14న నిర్వహించిన హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్ వైద్య విద్యార్థులకు, యువ రేడియాలజిస్టులకు ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు.

ఏపీఎంసీ చైర్మన్ డాక్టర్ శ్రీహరి రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, క్యాన్సర్ కేసులను ముందే గుర్తించేలా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ విజయలక్ష్మి దేవి మాట్లాడుతూ స్విమ్స్‌లో మామోగ్రామ్, బ్రెస్ట్ ఎంఆర్ఐ, పెట్ సిటీ వంటి అధునాతన సౌకర్యాలు ఉన్నాయని, మహిళలు అవగాహనతో వీటిని వినియోగించుకోవాలని కోరారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా దాదాపు 200 మంది ప్రతినిధులు పాల్గొని తమ పరిశోధన పత్రాలను సమర్పించారు.

SVIMS #RadiologyConference #BreastImaging #WomenHealth #TirupatiMedical #PinkBus #CancerAwareness #MedicalEducation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *