భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా ‘లొంగిపోయారని’, ఈ ఒప్పందం వల్ల దేశంలోని కోట్ల మంది రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆరోపించింది. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ, వాణిజ్య ఒప్పందాల పేరుతో దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టి బానిసత్వానికి బాటలు వేయవద్దని కేంద్రాన్ని హెచ్చరించారు. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, ఇంధన భద్రత మరియు డేటా గోప్యత వంటి అంశాల్లో భారత్ ప్రయోజనాలను మోదీ ప్రభుత్వం ఫణంగా పెట్టిందని ఆయన మండిపడ్డారు.
రైతులకు ఉరితాడుగా అమెరికా దిగుమతులు
అమెరికా నుండి మొక్కజొన్న, సోయాబీన్, పత్తి మరియు పండ్ల దిగుమతులపై సుంకాలను తొలగించడం భారతీయ రైతులపై ప్రత్యక్ష దాడి అని సుర్జేవాలా పేర్కొన్నారు. అమెరికా తన రైతులకు ఏడాదికి రూ. 1.45 లక్షల కోట్ల సబ్సిడీ ఇస్తుందని, దానికి విరుద్ధంగా భారత రైతులకు ఇచ్చే అతి తక్కువ సబ్సిడీని కూడా తగ్గించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని విమర్శించారు. దీనివల్ల మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లోని సోయాబీన్ మరియు పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ‘ఆపరేషన్ సింధూర్’ నిలిపివేత విషయంలో ఎలాగైతే ట్రంప్ ఒత్తిడికి తలొగ్గారో, ఇప్పుడు కూడా అదే పునరావృతమైందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎద్దేవా చేశారు.
భారతదేశం తన ఇంధన భద్రతను కూడా ప్రమాదంలో నెట్టుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. రష్యా నుండి తక్కువ ధరకే లభించే ముడి చమురును కొనబోమని అమెరికాకు హామీ ఇవ్వడం వల్ల దేశ ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతుందని సుర్జేవాలా వివరించారు. 2022 నుండి 2026 మధ్య రష్యా చమురు వల్ల భారత్ రూ. 1.81 లక్షల కోట్లు ఆదా చేసిందని, ఇప్పుడు అధిక ధరలకు అమెరికా, వెనిజులా నుండి చమురు కొనాల్సి రావడం స్వయం సమృద్ధిని దెబ్బతీయడమేనని విమర్శించారు. ప్రభుత్వం వెనుక నుంచి జీఎం (GM) పంటలను దేశంలోకి ప్రవేశపెట్టేందుకు దొడ్డిదారి వెతుకుతోందని అనుమానం వ్యక్తం చేశారు.
బలమైన ప్రభుత్వమా లేక బలహీన ప్రభుత్వమా?
ఈ ఒప్పందం సమానత్వ ప్రాతిపదికన జరగలేదని, అమెరికా ఒత్తిడి వల్లే భారత్ లొంగిపోయిందని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. “ఇది మజ్బూత్ సర్కార్ (బలమైన ప్రభుత్వం) అని చెప్పుకుంటున్న వారు, నిజానికి మజ్బూర్ సర్కార్ (నిస్సహాయ ప్రభుత్వం) గా మారిపోయారు. మనం ఆత్మనిర్భర్ భారత్ దిశగా వెళ్తున్నామా లేక అమెరికా-నిర్భర్ భారత్ దిశగా వెళ్తున్నామా?” అని సుర్జేవాలా ప్రశ్నించారు. ఈ వాణిజ్య ఒప్పందంపై పార్లమెంటులో బహిరంగ చర్చ జరగాలని, రైతులకు మరియు దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
Summary: The Congress party has launched a stinging attack on Prime Minister Narendra Modi, accusing him of “surrendering” to US President Donald Trump over the recent interim trade deal. Congress leaders Randeep Surjewala and Jairam Ramesh alleged that the agreement sacrifices India’s agricultural interests, energy security, and national sovereignty. They claimed that opening Indian markets to duty-free American farm products will devastate domestic farmers, while halting Russian oil imports under US pressure will hurt India’s economy. The party questioned whether India is heading towards “America-dependence” instead of “self-reliance” and demanded a public debate on the deal’s implications.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.