March 16, 2026

అమరజీవి త్యాగం తెలుగు జాతికి శాశ్వత ప్రేరణ

MINISTER ATCHENNAIDU

MINISTER ATCHENNAIDU

తెలుగు ప్రజల స్వాభిమానం కోసం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలనే తృణప్రాయంగా అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం భారత చరిత్రలో చిరస్మరణీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొనియాడారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో అమరజీవి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన ఘన నివాళులు అర్పించారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఆ మహనీయుడి అడుగుజాడల్లో నడవడమే మనం ఇచ్చే నిజమైన గౌరవమని పేర్కొన్నారు.


1952లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష తెలుగు జాతి చరిత్రను మలుపు తిప్పిందని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ఆయన అచంచల సంకల్పం వల్లే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ఆయన త్యాగమే ప్రధాన ప్రేరణగా నిలిచిందని తెలిపారు. తెలుగు వారికి ఒక ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని ఇచ్చిన ఆ మహనీయుడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం ఒక చారిత్రాత్మక ఘట్టమని మంత్రి అభివర్ణించారు. ఆ మహనీయుడు దీక్ష చేసిన రోజులకు గుర్తుగా 58 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించడం, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి నిదర్శనమన్నారు. ఈ విగ్రహం రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే గొప్ప చిహ్నంగా నిలిచిపోతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

పొట్టి శ్రీరాములు స్వార్థం లేని ఉద్యమం చేశారని, పదవుల కోసం కాకుండా సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని మంత్రి కొనియాడారు. నేటి యువత అమరజీవి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలుగు జాతి ఉన్నంత కాలం పొట్టి శ్రీరాములు పేరు చరిత్రలో అజరామరంగా నిలిచి ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

PottiSriramulu #Atchennaidu #AndhraPradesh #TeluguPride #Amaravati #StatueOfSacrifice #APPolitics #Inspiration #TDP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *