ముగ్గురు పిల్లల ముచ్చట సరే.. పోషించే నాథుడెవరు బాబూ?
పిల్లలు పాలు తాగినా చావే.. నీళ్లు తాగినా చావే..
రాష్ట్రంలో చిన్నారుల ఆరోగ్యం, విద్యపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగుతుండగా, యువత ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఒక్కరిద్దరు పిల్లలను సాకడమే భారంగా మారుతుంటే, అదనపు సంతానాన్ని కంటే వారి పోషణ బాధ్యత ఎవరు తీసుకుంటారని జగన్ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో పిల్లలు పాలు తాగినా, హాస్టళ్లలో నీళ్లు తాగినా ప్రాణాలు కోల్పోయే దారుణ స్థితి నెలకొందని ఆయన విమర్శించారు.
గాలికెగిరిన గోరుముద్ద.. నాణ్యత లేని విద్యావైద్యం
బాబు గారి పాలనలో పిల్లలు పాలు తాగినా, హాస్టళ్ళలో నీళ్లు తాగినా చనిపోతున్నారని స్కూళ్ళు, హాస్టళ్లలో జరిగిన సంఘటలను ఉటంకిస్తూ విమర్శలు చేశారు. తమ హయాంలో ఇచ్చే గోరుముద్ద గాలికెగిరిపోయింది. ఇస్తున్న దాంట్లోనూ నాణ్యత లేదు. కలుషిత నీళ్ళు… కల్తీపాలు.. అమ్మఒడి అరకొర.. ఆరోగ్యం అంతంత మాత్రమేనని మండిపడ్డారు.
ప్రభుత్వం ఆసుపత్రుల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని,ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లీనిక్ ను రద్దు చేశారని విమర్శించారు. ఇప్పటికే 10లక్షల మంది ప్రభుత్వ స్కూల్స్ నుంచి వెళ్లిపోయారన్నారు. ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం గాలికెగిరిపోయిందని ఆరోపించారు.
కుప్పకూలిన వైద్య వ్యవస్థ.. బాధ్యత ఎవరిది?
వైద్య రంగంలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లీనిక్ వ్యవస్థలను రద్దు చేసి సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని జగన్ ధ్వజమెత్తారు. చిన్నారులకు ఇచ్చే ట్యాబులను వెనక్కి తీసుకోవడం, ఆంగ్ల మాధ్యమాన్ని రద్దు చేయడం వంటి చర్యలు తీసుకున్న చంద్రబాబుకు, అదనంగా పిల్లలను కనమని చెప్పే నైతిక హక్కు లేదని విమర్శించారు. బాబు మాటలు నమ్మి పిల్లలను కంటే, వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేది ఎవరని ఆయన నిలదీశారు.
#YSJagan #Chandrababu #AndhraPradesh #Education #HealthCare #APPolitics

