March 30, 2026

ఐపీఎల్ వ్యాపారం ఆపండి: ఆన్లైన్ బెట్టింగ్‌పై ఎ.ఐ.వై.ఎఫ్ బహిరంగ నిరసన

విశాఖపట్నం: అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద ఐపీఎల్ (IPL) మ్యాచ్‌లను రద్దు చేయాలంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎ.ఐ.వై.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వై. రాంబాబు, కార్యదర్శి కె. అచ్యుత్ రావు మాట్లాడుతూ, క్రీడారంగాన్ని కొద్దిమంది కార్పొరేట్ సంస్థలు తమ అధీనంలోకి తీసుకొని, ఐపీఎల్‌ను వ్యాపార మోడల్‌గా మార్చేశారని ఆరోపించారు.

ఐపీఎల్ ద్వారా యువతను online betting apps బానిసలుగా తయారు చేస్తున్నారని, వేల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయని తెలిపారు. గణాంకాల ప్రకారం, ఏటా 8.50 లక్షల కోట్ల రూపాయలు ఐపీఎల్ నిర్వహణ సమయంలో బెట్టింగ్ రూపంలో చేతులు మారుతున్నాయని వివరించారు. విదేశాల నుంచి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ (apps) ద్వారా జరిగే అక్రమ లావాదేవీలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వానికి ఆన్లైన్ గేమ్స్ పైనే ఏడాదికి 12 వేల కోట్ల పన్నుల ఆదాయం వస్తోందని, అయినప్పటికీ చట్టవ్యతిరేకమైన యాప్స్‌ పై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఎ.ఐ.వై.ఎఫ్ నాయకులు అన్నారు. ఈ పరిస్థితిని తాము మౌనంగా చూస్తామని అనుకోవద్దని, భవిష్యత్‌లో రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో ఎన్. మధురెడ్డి, పి. శివకుమార్, మురళి తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *